తల్లి ఫొటో షేర్ చేసి..ప్రియాంక ఎమోషనల్ ట్వీట్

తల్లి ఫొటో షేర్ చేసి..ప్రియాంక ఎమోషనల్ ట్వీట్

సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఇటీవలే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జున ఖర్గేకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఖర్గే.. సోనియాకు రాజీవ్‌ గాంధీ చిత్రాన్ని బహూకరించారు. దాన్ని సోనియా గాంధీ పైకెత్తి చూపిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. ఈ చిత్రాన్ని ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో పాటు "నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా! ప్రపంచం ఏమనుకున్నా.. ఏం ఆలోచించినా సరే. నాకు తెలుసు ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌ అని!’’ అంటూ ప్రియాంక రాసుకొచ్చారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఓ ట్వీట్ చేశారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీలు కలిసి నడిచి వెళ్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు తాను సోనియాకు కొడుకైనందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చారు.

సోనియా గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘనంగా వీడ్కోలు పలికింది. పార్టీ తరఫున ఆ పార్టీ నేత అజయ్‌ మాకెన్‌ వీడ్కోలు ప్రకటనను చదివి వినిపించారు. దేశం పట్ల ఆమెకున్న ప్రగాఢమైన ప్రేమ నుంచి ఆమె తన రాజకీయ స్ఫూర్తి పొందారని, ప్రజలు కూడా అదే ప్రేమ, అదే నమ్మకాన్ని ఆమెకు తిరిగి ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీలో తన జోక్యం ద్వారా అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మారేలా పార్టీని తీర్చిదిద్దారని కొనియాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో, దూరదృష్టితో ఆమె తీసుకున్న నిర్ణయాలు పార్టీ భవిష్యత్‌కు పునాది వేశాయని ప్రశంసించారు.