ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీదే హుజూరాబాద్  

V6 Velugu Posted on Jul 27, 2021

  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా  హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీ పార్టీయేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని వయోల  గార్డెన్ లో జరుగుతున్న రాష్ట్ర  మహిళా మోర్చా కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ లో నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.  దుబ్బాక సెగ ప్రగతి భవన్ కు తాకినందువల్లే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2023లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. బీజేపీ పార్టీకి  కేసులు కొత్తేం కాదు, దుబ్బాక ఎన్నికల్లో నాపై అనేక కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రగతి భవన్ నుండి బయటకు రాని సీఎం, హుజురాబాద్ ఎన్నికల అనగానే బయట తిరుగుతున్నాడు, కొత్త కొత్త పథకాలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాడని ఆయన పేర్కొన్నారు. పనిలో పనిగా కాంగ్రెస్, షర్మిల పార్టీలపై ఆయన పరోక్షంగా సెటైర్లు విసిరారు. కొత్తగా వచ్చిన పార్టీ అధ్యక్షులతో ఏమి అయ్యేది లేదు, ఓటుకు దొరికిన వారు, నోటుకు దొరికిన వారు,  జైల్లో పోయి వచ్చిన వల్ల తో ఏమీ కాదని,  వారి స్వస్థలం శ్రీకృష్ణ జన్మస్థలమేనని ఆయన జోస్యం చెప్పారు.  ఢిల్లీలో లేని పార్టీ గల్లీలలో ఎలా గెలుస్తుంది? అని ఆయన షర్మిల పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ అహంకారానికి  దుబ్బాకలో బీజేపీ గెలుపు ఒక చెంప పెట్టు లాంటిదన్నారు. 
 

Tagged Siddipet Today, , bjp mahila morcha meeting, bjp meeting in siddipet, mla raghunandan rao comments, mla raghunandan rao Latest comments

Latest Videos

Subscribe Now

More News