వరద బాధితులకు పైసా ఇవ్వలేదు

వరద బాధితులకు పైసా ఇవ్వలేదు
  • ఢిల్లీలో సీఎం, కబ్జాల్లో మంత్రులు బిజీ 
     
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు  ప్రవీణ్ కుమార్

బూర్గంపహాడ్/ పాల్వంచ, వెలుగు: వరద బాధితులకు సీఎం ప్రకటించిన రూ. 10 వేల సాయం ఇచ్చేందుకు ఇంటి టాక్స్​, కరెంటు రశీదులు చూపించమంటున్నారని, ఊరంతా వరదలో మునిగితే రశీదులు ఎక్కడ ఉంటాయని బీఎస్పీ  రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బాధితులు కష్టాల్లో ఉంటే వారిని టాక్సులు కట్టాలనడం దారుణమన్నారు. సోమవారం బూర్గంపహాడ్ లోని వరద బాధితులను పరామర్శించిన ఆయన.. పాల్వంచలో మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు సాయం చేస్తామన్న సీఎం కేసీఆర్​ వారి సంగతి మరిచి ఢిల్లీలో తిరుగుతున్నారని, మంత్రులు కబ్జాల్లో మునిగిపోయారని  ఆరోపించారు.  బాధితులకు రూ. 10 వేలు తక్షణ సాయం ఇస్తామని కేసీఆర్​ప్రకటించినా  ఇప్పటివరకు పది పైసలు కూడా ఇవ్వలేదన్నారు.  25 కిలోల బియ్యం కూడా చాలామందికి ఇవ్వలేదని, రేషన్ కార్డు తెస్తేనే బియ్యం ఇస్తామనడం అన్యాయమన్నారు.  పంటనష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదన్నారు. అధునిక పద్దతుల్లో భారీగా పెట్టుబడి పెట్టి  మక్బూల్​అహ్మద్​ అనే రైతు సాగు చేసిన  డ్రాగన్ ఫ్రూట్ పంట వరదల్లో కొట్టుకుపోయి లక్షల్లో నష్టపోయాడని,  దిక్కుతోచని స్థితిలో ఉన్న అతన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.  పంట నష్టపోయిన  రైతులకు బీమా వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పోలవరం  పూర్తయితే చాలాగ్రామాలు నష్టపోతాయని,  ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. అనంతరం వీఆర్ఏల  సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. 

వరద  బాధితులకు రూ. 10 వేల పరిహారం అందిస్తానని కేసీఆర్​మాయమాటలు చెప్పి వారిని ఘోరంగా మోసగిం చారని  ప్రవీణ్ కుమార్ విమర్శించారు. వరంగల్ వెళుతూ పాల్వంచ లో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను చెల్లిస్తేనే రూ.10 వేల సాయం ఇస్తామని అధికారులు మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు కనీస సాయం అందించకపోగా పన్నులు వసూలు చేయడం సరికాదన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంవల్ల ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక పూర్ణా టీ స్టాల్ లో టీ కాచి, చపాతీ చేశారు.