దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా ఆగ్రతారలుగా వెలుగుతున్న ముద్దుగుమ్మలు నయనతార, త్రిష కృష్ణన్. ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించి.. పోటాపోటీగా సినిమాలు చేస్తూ సౌత్ క్వీన్స్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ బద్ధ శత్రువులని, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ సుందరరాంగులు దుబాయ్ వీధుల్లో సందడి చేశారు. వీరిద్దరి కలయిక ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..
దుబాయ్ సాగర తీరాన..
లేటెస్ట్ గా త్రిష, నయనతార దుబాయ్‌లో కలిసి విహరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్‌తో పాటు ఆనందానికి గురవుతున్నారు. ఒక విలాసవంతమైన యాచ్‌పై, సూర్యాస్తమయం వేళ ప్రశాంతమైన సముద్రపు అలల మధ్య ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చిల్ అవుతూ కనిపించారు. నయనతార, త్రిష సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం చూస్తుంటే, ఒకప్పుడు వచ్చిన గొడవల వార్తలన్నీ పటాపంచలు అయ్యాయి. అవి కేవలం పుకార్లేనని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 2000వ దశకం చివరలో వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. కానీ కాలక్రమేణా ఆ పోటీ ఆరోగ్యకరమైన స్నేహంగా మారిందని ఈ పిక్స్ నిరూపిస్తున్నాయి.
వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ
వరుస సినిమాలతో నయనతార ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ ఎంట్రీ 'జవాన్' తర్వాత ఆమె క్రేజ్ ను మరింత స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం 'టాక్సిక్ ' (Toxic)లో నయన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం 2026 మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఇటీవల చిరంజీవి సరసన నటించిన 'మన శంకర్ వరప్రసాద్ గారు'సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది. చాలా కాలం తర్వాత మలయాళంలో నివిన్ పాలీతో 'డియర్ స్టూడెంట్స్', మమ్ముట్టి, మోహన్ లాల్‌తో 'పేట్రియాట్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే లెజెండరీ డైరెక్టర్ అడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో మమ్ముట్టి సరసన మరో సినిమా చేయబోతోంది.
త్రిష 'మెగా' రీ-ఎంట్రీ ..
త్రిష కూడా ఏమాత్రం తగ్గకుండా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత త్రిష జతకడుతోంది. సోషియో ఫాంటసీ మూవీగా వస్తున్న 'విశ్వంభర' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి . సూర్య సరసన 'కరుప్పు' అనే పీరియడ్ యాక్షన్ మూవీలో నటిస్తోంది. ఇవే కాకుండా మలయాళంలో మోహన్ లాల్‌తో 'రామ్' చిత్రంలోనూ భాగమైంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య స్నేహం ఉండదు అనే మాటను నయన్-త్రిష పటాపంచలు చేశారు. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో, కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉంటూనే ఒకరికొకరు తోడుగా నిలవడం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోందంటున్నారు అభిమానులు.. నంబర్ వన్ స్థానం కోసం పాకులాడకుండా, 'స్టార్‌డమ్'ను ఎంజాయ్ చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
