
- అమెరికన్లకే ప్రాధాన్యమివ్వండి
- గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆదేశం
వాషింగ్టన్: గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు ఇండియన్స్కు జాబ్స్ ఇవ్వడం మానుకోవాలని, అదే సమయంలో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బుధవారం వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ మాట్లాడారు. అమెరికా కంపెనీలు చైనాలో కంపెనీలు పెడుతున్నాయని, అక్కడ ఇండియన్స్కు ఉద్యోగాలు ఇస్తున్నాయన్నారు. ఇక అవన్నీ బంద్ పెట్టాలన్నారు. టెక్ కంపెనీలు గ్లోబలిస్ట్ మనస్తత్వాన్ని వీడి దేశభక్తిని ప్రదర్శించాలన్నారు. టెక్ కంపెనీలు అమెరికన్లను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘అమెరికాను మొదటి స్థానంలో ఉంచండి. అదే మేం కోరేది’ అని ఐటీ కంపెనీలకు ట్రంప్ స్పష్టం చేశారు.
కొన్ని టెక్ కంపెనీలు అమెరికాలో ఫ్రీడంను ఉపయోగించుకొని లాభాలను ఆర్జిస్తున్నాయని, కానీ ఆ లాభాలను విదేశాల్లో పెట్టుబడిగా పెట్టి, అక్కడి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ఇక తాను ప్రెసిడెంట్ స్థానంలో ఉండగా అవన్నీ జరగవన్నారు. ఏఐ రేస్‌లో గెలవాలంటే సిలికాన్ వ్యాలీలో దేశభక్తి, జాతీయ విధేయత చూపించాలన్నారు. ఈ సదస్సులో మూడు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం చేశారు.
అందులో భాగంగా.. ‘విన్నింగ్ ది రేస్’ పేరుతో అమెరికాను ఏఐలో అగ్రగామిగా నిలపడానికి డేటా సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఏఐకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫెడరల్ నిధులతో ఏఐని అభివృద్ధి చేసే కంపెనీలు రాజకీయంగా తటస్థంగా ఉండాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో తయారైన ఏఐ అప్లికేషన్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలని, వాటి ఎగుమతిని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.