తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారితో కొండ కిటకిటలాడుతోంది. క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో రికార్డు దర్శనాలు కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. అయితే వేసవి కారణంగా భక్తులు క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా రీఎంట్రీ అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో దర్శనం కోసం 24 గంటల వరకు క్యూ లైన్లలో ఉండాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో 32 గంటల సమయం తీసుకుంటోంది. దీంతో.. ఇన్ని గంటలు క్యూ లైన్లలో నిలబడి ఉండటం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఎండకాలం కారణంగా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రీఎంట్రీ విధానాన్ని తీసుకొచ్చారు.
రీ ఎంట్రీ అంటే లైన్లలో ఉన్న భక్తులు క్యూలైన్ల నుంచి బయటకు వెళ్లి దర్శనానికి ముందు క్యూలైన్లలో చేరుకునే విధానం. భక్తులు అవసరమైతే క్యూ లైన్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి రెండు గంటల ముందు క్యూ లైన్లలో చేరుకోవచ్చు.
గత వారం రోజులుగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సోమవారం 89 వేల399 మంది భక్తులు స్వామి వారిని దర్శించున్నారు. దీంతో, పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ 'రీ ఎంట్రీ' విధానం ప్రవేశపెట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
