సిట్ దర్యాప్తుపై సింగిల్ జడ్జి పర్యవేక్షణ అక్కర్లేదు : సుప్రీంకోర్టు

సిట్ దర్యాప్తుపై సింగిల్ జడ్జి పర్యవేక్షణ అక్కర్లేదు : సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. సిట్ దర్యాప్తు యథాతథంగా కొనసాగించుకోవచ్చని చెప్పింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించాలన్న హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో బెయిల్‌కు దరఖాస్తు చేసి ఉంటే ఎప్పుడో ఇచ్చే వాళ్లమని వ్యాఖ్యానించింది.

సుదీర్ఘ వాదనల తర్వాత ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో నిందితులు వేసిన రెండు పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్లు వెల్లడించింది. నిందితులకు రిమాండ్ విధిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర సిట్‌తో కాకుండా సీబీఐ లేదా కేంద్రం వేసే సిట్ ద్వారా జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. తొలుత నిందితుల రిమాండ్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.

నిందితులను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది తన్మయ్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ఇది ట్రాప్ కేసు. ట్రాప్ కోసం పోలీసులు ఉపయోగించిన పరికరాల డీటైల్స్ సరిగా లేవు. ఈ కేసులో ఎలాంటి రికవరీ జరగలేదు. లంచం తీసుకున్న వారికే పీసీ చట్టం వర్తిస్తుంది. చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసిన కారణంగానే.. రిమాండ్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది” అని వివరించారు. ఏడేండ్ల వరకు శిక్ష పడే కేసులో సీఆర్‌‌పీసీ 41ఏ ప్రకారం ముందుగానే నోటీసు ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరారు.

రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు 

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రాలు వాదనలు వినిపించారు. అవినీతిని పట్టుకునేందుకు ట్రాప్ వేశామని, పోలీసులు అక్కడే ఉన్నారని, ముందుగానే నోటీసు ఇవ్వాల్సిన అవసరమేమీ లేదన్నారు. అక్కడికక్కడే నిందితులను పట్టుకోకపోతే వారు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పారు. అందుకే వారిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే నేరానికి నిందితులు పాల్పడ్డారని తెలిపారు. స్పందించిన బెంచ్.. నిందితులు రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకొని ఉంటే ఎప్పుడో ఇచ్చే వాళ్లమని చెప్పింది. పిటిషనర్ వేసే బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. పిటిషనర్ రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఉందని, ప్రస్తుత పరిస్థితిలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

దర్యాప్తును రాష్ట్ర సిట్‌తో కాకుండా సీబీఐ లేదా కేంద్రం వేసే సిట్ ద్వారా జరిపించాలని దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీం బెంచ్ విచారించింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సింగిల్ జడ్జి పక్కన పెట్టడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దర్యాప్తు పారదర్శకంగా సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి పర్యవేక్షణను ఎత్తివేసింది. సిట్‌ విచారణ కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. సీల్డ్‌ కవర్‌లో నివేదికలు ఇవ్వాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆంక్షలన్నీ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది.