ఎన్నికను బహిష్కరించిన గ్రామస్తులు.. కోర్టుకెక్కిన ‘పేరూరు’ పంచాయతీ ఎన్నిక

ఎన్నికను బహిష్కరించిన గ్రామస్తులు.. కోర్టుకెక్కిన ‘పేరూరు’ పంచాయతీ ఎన్నిక
  • సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ 
  • ఒక్కరూ నామినేషన్ వేయలేదు 

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా అనుముల మండ లం పేరూరు పంచాయతీ ఎన్నికను గ్రామస్తులు బహిష్కరించారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. కాగా.. ఒక్కరే ఎస్టీ పురుష ఓటరు ఉన్నారు.  అంతేకాకుండా 8 వార్డుల్లో 4 ఎస్టీకి రిజర్వ్ కాగా..  ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. దీంతో గ్రామస్తులు రిజర్వేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్టీ ఓటర్లు లేని పంచాయతీలో ఎస్టీకి రిజర్వ్ కు చేయడమేంటని అధికారుల తీరును తప్పుబడుతూ గ్రామస్తులు ఎన్నికను బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించి డప్పు చాటింపు కూడా వేయించారు. 

ఎన్నికపై గ్రామానికి చెందిన కొందరు గత నెల 28న హైకోర్టులో పిటిషన్ వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటి పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉంది. గత ప్రభుత్వంలో పంచాయతీల విభజనలో పేరూరు నుంచి వీర్లగడ్డ విడిపోయి పంచాయతీగా ఏర్పడింది. వీర్లగడ్డ తండాకు చెందిన ఒక ఎస్టీ ఓటరు పేరూరు పంచాయతీలో తప్పుగా నమోదైంది.  ఆ ఒక్క ఓటును ఆధారంగా చేసుకుని అధికారులు ఎస్టీకి రిజర్వ్ చేశారు. 

కాగా గురువారం హైకోర్టులో వాదనలు జరగనుండగా గ్రామస్తులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గ్రామ కార్యదర్శి జాన్ బాబు మాట్లాడుతూ.. పంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డుల్లో కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.