పోటీ నుంచి తప్పుకోవాలని వేధింపులు.. వార్డు మెంబర్ పోటీదారు సూసైడ్‌‌‌‌ ?

పోటీ నుంచి తప్పుకోవాలని వేధింపులు.. వార్డు మెంబర్ పోటీదారు సూసైడ్‌‌‌‌ ?
  • రంగారెడ్డి జిల్లా కంసాన్‌‌‌‌పల్లిలో వార్డు సభ్యుడిగా నామినేషన్​వేసిన యువకుడు
  • విత్‌‌‌‌డ్రా చేసుకోవాలని ఒత్తిళ్లు.. కేసులు పెట్టిస్తామని బెదిరింపులు
  • తెల్లారేసరికి రైలు పట్టాలపై కనిపించిన యువకుడి డెడ్‌‌‌‌బాడీ

షాద్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా నామినేషన్‌‌‌‌ వేసిన ఓ యువకుడు రైలు కింద పడి చనిపోయి కనిపించాడు. అయితే యువకుడి మృతికి రాజకీయాలే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌‌‌‌నగర్‌‌‌‌ మండలంలోని కంసాన్‌‌‌‌పల్లి గ్రామ నాలుగో వార్డుకు బీజేపీ మద్దతుతో ఆవ శేఖర్‌‌‌‌ (24) నామినేషన్‌‌‌‌ వేశాడు. 

నామినేషన్‌‌‌‌ విత్‌‌‌‌డ్రా చేసుకోమంటూ అతడికి రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన శేఖర్‌‌‌‌ అదే రోజు రాత్రి షాద్‌‌‌‌నగర్‌‌‌‌లోని సోలిపూర్‌‌‌‌ శివారులో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఆధార్‌‌‌‌ కార్డు ఆధారంగా రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. శేఖర్‌‌‌‌ది హత్యనా ? లేక ఆత్మహత్యనా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

వేధింపులే కారణమా ? 

శేఖర్‌‌‌‌ను నామినేషన్‌‌‌‌ ఉపసంహరించుకోవాలని గ్రామంలో కొందరు వ్యక్తులు వేధిస్తున్నారని, లైంగికదాడి చేసినట్టు కేసులు నమోదు చేయిస్తామని బెదిరించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని శేఖర్​గ్రామంలోని కొంతమందికి చెప్పుకుని బాధపడినట్టు తెలిసింది. మృతి వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు తెలుస్తుండడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్‌‌‌‌ బెదిరించిండు : తల్లిదండ్రుల ఆరోపణ

కంసాన్‌‌‌‌పల్లికి చెందిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్‌‌‌‌ కంది యాదయ్య గౌడ్, అతడి అనుచరులు నామినేషన్‌‌‌‌ ఉపసంహరించుకోవాలని శేఖర్‌‌‌‌ను బెదిరించారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కొడుకు చావుకు యాదయ్య గౌడ్‌‌‌‌తో పాటు ఆవ హనుమంతు, ఇప్పటూరు సత్తయ్య, కంది మల్లేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఆవ కృష్ణయ్య కారణమని శేఖర్​తండ్రి వెంకటయ్య మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే యాదయ్య గౌడ్ మాత్రం కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌ నరేందర్‌‌‌‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్.. నరేందర్‌‌‌‌రెడ్డి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కి వెళ్లాడని, అప్పటి నుంచ కనిపించకుండా పోయాడని అంటున్నారు.

వైరల్ అవుతున్న ఆడియో...

శేఖర్‌‌‌‌ ఊరు వదిలి వెళ్లిపోయాక అతడి సోదరుడు బాలరాజుతో ఫోన్‌‌‌‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌‌‌‌ అవుతోంది. శేఖర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసిన బాలరాజు ‘ పోటీలోకి దిగాక ఎందుకు భయపడుతున్నావ్.. ఎక్కడున్నావ్.. వెంటనే ఇంటికి వచ్చెయ్. యాదన్న నీతో ఏమైనా మాట్లాడాడా.. అవసరమైతే కాంప్రమైజ అవుదాం ... రమేశ్​అన్నతోనూ మాట్లాడాం.. పోటీ నుంచి విరమించుకుందాం.. మన బతుకులు ఇంతే అని సరిపెట్టుకుందాం’ అని చెప్పగా శేఖర్‌‌‌‌ తాను హైదరాబాద్‌‌‌‌లో ఒక్కడినే ఉన్నానని చెప్పాడు.

 దీనికి బాలరాజు ‘ఎన్నికలే బతుకు కాదు తమ్మీ. ట్రాక్టర్ నడుపుకొని బతుకుదాం..వచ్చేయ్’ అనగా, ఊళ్లో తనను బ్లేమ్ చేస్తున్నారని, ఏమేమో అంటున్నారని శేఖర్‌‌‌‌ వాపోయాడు. రేపు ఉదయం వస్తానని చెప్పడంతో ఫోన్​పెట్టేశాడు. అయితే, అంతలోనే శేఖర్​రైలు పట్టాలపై శవమై కనిపించడం విషాదాన్ని నింపింది.