- షాకింగ్ డేటా బయటపెట్టిన కేంద్ర సర్కారు
- జనాభాలో దాదాపు 15 శాతం మందికి చికిత్స
న్యూఢిల్లీ: ఎయిర్ పొల్యూషన్‌తో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. తీవ్ర కాలుష్యంతో మూడేండ్లలోనే 2 లక్షలకుపైగా తీవ్ర శ్వాసకోశ కేసులు నమోదయ్యయి. 2022- –2024 మధ్య 6 ప్రధాన ఆసుపత్రుల్లో ఈ కేసులు రికార్డయినట్టు.. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) ప్రతాప్‌రావు జాదవ్ సమాధానమిచ్చారు. ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యతే ఈ శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను కేంద్ర సర్కారు నిశితంగా పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో శ్వాసకోశ వ్యాధుల సంఖ్య చాలా తీవ్రంగా ఉందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
ఢిల్లీలోని 6 ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2022– 2024 మధ్య అత్యవసర విభాగాలకు 2,04,758 తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఏఆర్‌ఐ) కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీటిలో.. 30,420 మంది రోగులు - దాదాపు 15 శాతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.
ప్రభుత్వం అందించిన డేటా ఇదే..
కేంద్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం.. 2022లో 67,054 ఏఆర్‌ఐ కేసులు నమోదు కాగా... 9,874 మంది దవాఖానల్లో చేరారు.2023లో 69,293 కేసులు రికార్డు కాగా.. 9,727 మంది హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. 2024లో 68,411 అత్యవసర కేసులు నమోదు కాగా.. 10,819 మంది చికిత్స పొందారు. 2024లో మొత్తం ఎమర్జెన్సీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, దవాఖానలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య బాగా పెరిగింది. దీన్ని బట్టి శ్వాస సమస్యలతో దవాఖానలో చేరుతున్న కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్టు తేలిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, బుధవారం ఢిల్లీలో తెల్లవారుజామున వెహికల్స్ రద్దీ తక్కువ ఉన్న సమయంలోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 377గా నమోదైనట్టు పలు కథనాలు వెలువడ్డాయి. చాలాచోట్ల ఏక్యూఐ 400 కంటే ఎక్కువగా నమోదవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది.
ఇతర మహానగరాల్లో కూడా ఇదే పరిస్థితి
ఢిల్లీ మాత్రమే కాకుండా.. ముంబై, చెన్నైలాంటి మెట్రో నగరాల్లో కూడా తీవ్ర కాలుష్యంతో ప్రజల్లో శ్వాస సంబంధ వ్యాధులు పెరిగాయి. ఈ నగరాల్లో కూడా ఏఆర్‌ఐ కేసులు, ఆసపత్రుల్లో అడ్మిషన్లు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి కాలుష్య ప్రభావంతోపాటు ఆహారపు అలవాట్లు, వృత్తి, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, రోగనిరోధక శక్తి వంటివి కూడా కారణమని పేర్కొంది.
ముఖ్యంగా డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధితులు అవుతున్నారని చెప్పింది. కాలుష్యం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి.. రక్తంలో షుగర్ స్థాయిలను అస్థిరం చేస్తోందని నిపుణులు తెలిపారు.
జంతర్ మంతర్ వద్ద ఢిల్లీవాసుల ధర్నా
న్యూఢిల్లీ, వెలుగు: పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్‌తో విసిగిపోయిన ఢిల్లీవాసులు స్వచ్ఛమైన గాలి కోసం రోడ్డెక్కారు. శ్వాసించే హక్కు కల్పించాలంటూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పౌర సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్వాస తీసుకోవడం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సూచీపై 50ని ప్రాథమిక హక్కులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఆక్సిజన్ సిలిండర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్లు, ఆక్సిజన్ మాస్కులతో నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పౌర సంఘాల నేతలు, ఢిల్లీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు..
‘కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తక్షణ అత్యవసర ప్రణాళిక అవసరం. అన్ని కాలుష్య వనరులను అరికట్టడానికి దీర్ఘకాలిక వ్యూహం అనుసరించాలి. ఢిల్లీలో ఏక్యూఐ 500+ తో పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ప్రభుత్వాల నిశ్శబ్దం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
