యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని లక్ష్మీ పుష్కరిణిలో పడి ఓ బాలుడు చనిపోయాడు. యాదగిరిగుట్ట టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేటకు చెందిన టీకోలు బుజ్జమ్మ తన కొడుకు సంతోష్ (10) కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం యాదగిరిగుట్టలోని బంధువుల ఇంటికి వచ్చింది.
బుధవారం వారంతా దేవస్థానం పరిధిలోని కల్యాణకట్ట వద్దకు వెళ్లగా.. బాలుడు ఆడుకునేందుకు లక్ష్మీపుష్కరిణి వద్దకు వెళ్లాడు. నీటిలో దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడి మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత భక్తులు గమనించి బయటకు తీసే సరికే చనిపోయి కనిపించాడు. బాలుడి తల్లి బుజ్జమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. కాగా, లక్ష్మీపుష్కరిణిలో పడి బాలుడు చనిపోవడంతో.. నీటిని పూర్తిగా తొలగించి సంప్రోక్షణ చేశారు. అనంతరం శుభ్రమైన నీటితో తిరిగి పుష్కరిణిని నింపడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
