- కేసీఆర్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు
- కాంగ్రెస్ పాలనలో రూపాయి లాభం జరగలే
- రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తేమీ కాదని.. అప్పట్లో ఆయన రాజీనామా చేస్తే సోనియా గాంధీ వణికిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం ఆయన ఎన్నోసార్లు రాజీనామా చేశారన్నారు. ఆయన రాజీనామాకు భయపడే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారని.. ఆయన వస్తే తట్టుకునే దమ్ము రేవంత్‌కు ఉందా? అని కేటీఆర్ సవాల్ చేశారు. కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి వస్తారని.. కానీ, సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతిపథాన నడిపిన కేసీఆర్స్థాయిని ఎవరూ తగ్గించలేరన్నారు. పాలన చేతకాకుంటే రేవంత్ తప్పుకోవాలన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారే కాదని పేర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన లీ కువాన్ యూను ఆ దేశం శాశ్వతంగా గౌరవించుకున్నట్టుగానే.. కేసీఆర్‌నూ తెలంగాణ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బుధవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్చార్జిషీట్ను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజాపాలన కాదని, ప్రజాపీడన అని మండిపడ్డారు. ప్రజలపై కాంగ్రెస్ పార్టీ దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులవుతున్నదన్నారు. సీఎం మాటల్లో చెప్పాలంటే ఇదో క్రిమినల్ వేస్ట్ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. రైతన్నల నుంచి ఆడబిడ్డలదాకా, విద్యార్థుల నుంచి నిరుద్యోగుల దాకా అన్ని వర్గాల వారూ అష్టకష్టాలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ప్రజలకు ఒక్క రూపాయిలాభం జరగకున్నా రూ.4.5 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారని ఆరోపించారు.
వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. యూరియా కోసం మళ్లీ లైన్లో చెప్పులు పెట్టే పరిస్థితి వచ్చిందని, రైతన్నల చేతికి బేడీలు వేశారని అన్నారు. రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుపెట్టి.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. ఒక బ్యారేజ్.. ప్రాజెక్టు.. చెరువు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. చెక్ డ్యామ్‌ను పేల్చి క్రిమినల్లాగా తయారైందన్నారు. సుంకిశాల, ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి అనేక ప్రమాదాలు జరిగినా ఒక్కరిపైనా చర్య తీసుకోలేదన్నారు. గురుదక్షిణగా గోదావరి నీళ్లు, తెలంగాణ జలహక్కులను చంద్రబాబుకు సమర్పించుకుంటున్నారని, తెలంగాణ జలహక్కులకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు. విద్యార్థులు జాబ్ క్యాలెండర్ అడిగితే లాఠీలు ఝుళిపిస్తున్నారన్నారు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే విద్యార్థులపై దాడులు చేయిస్తున్నదన్నారు. జాబ్ లేని జాబ్ క్యాలెండర్ ని ప్రకటించిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. ఏడాది దాటి మూడేండ్లు దాటినా ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. నిరుద్యోగులు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పైన రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
కమీషన్లలో వాటాల కోసం కొట్టుకుంటున్నరు
వెయ్యి రోజుల్లో సంపాదించుకున్న అక్రమ సంపాదన విషయంలో విభేదాల వల్లే ఈరోజు మంత్రులు బహిరంగంగా తన్నుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. 30 శాతం కమీషన్ లేకపోతే ఒక్క పని చేయడం లేదని, కుంభకోణాల్లో వాటాల కోసం పబ్లిక్ గా కొట్లాడుతున్నారని విమర్శించారు. ఒకరి లీలలను ఇంకొకరు బయట పెడుతున్నారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి మంత్రులే రూ.30 వేల కోట్ల నైనీ టెండర్ల కుంభకోణాన్ని ఆపాలంటున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లే సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపో యిందన్నా రు. పారిశ్రామిక వేత్తలను పిలిచి తుపాకీ పెట్టి బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ ను రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మంత్రులు తమకు ఏటీఎంగా మార్చుకొని విలువైన భూములపైన కన్నేసి బెదిరింపులకు దిగుతూ గూండాయిజం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై కచ్చితంగా గొంతెత్తుతామన్నారు.
