ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీ కోసం నేను పోరాడతా –వైఎస్ షర్మిల

ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీ కోసం నేను పోరాడతా –వైఎస్ షర్మిల
  • బంగారు తెలంగాణ నాతోనే సాధ్యం..  ఏడేళ్లుగా కేసీఆర్‌తో కాలేదు - వైెఎస్ షర్మిల

హైదరాబాద్: ఉద్యోగాలు రావడం లేదని మనస్తాపంతో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. మీ కోసం పోరాడడానికి నేను వచ్చానని వైఎస్ షర్మిల అన్నారు. లోటస్ పాండ్ లో దీక్ష కొనసాగిస్తూ ఆమె హాజరైన అభిమానులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతనుద్దేశించి మాట్లాడారు. నోటిఫికేషన్లు రావట్లేదని చెప్పిమరి ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ ప్రాణానికి విలువ లేదా అని ప్రశ్నించారు. సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ల అన్న కు ఉద్యోగం ఇస్తామని చెప్పారు, కుటుంబం లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకొకపోతే ఉద్యోగం రాదా? అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి ఎన్ని ఉద్యోగాలున్నాయో సమాధానం చెప్పండి.. కూతురు, కొడుకు, అల్లుడు ఇంకొకడికి ఎన్ని ఉద్యోగాలని షర్మిల ప్రశ్నించారు. సునీల్ నాయక్ అన్నకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు, ఇచ్చారా లేదా? ఈరోజు కూడా సునీల్ నాయక్ అన్నతో నేను మాట్లాడాను, ఉద్యోగం ఇవ్వలేదన్నాడు. ఉద్యోగం ఇచ్చారో, జాయిన్ అయ్యారో లేదో చూసుకోండని షర్మిల సవాల్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన షర్మిళ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పాదయాత్ర చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, పాదయాత్ర చేయాలంటే ఈ పాలకుల నుంచి అనుమతి తీసుకోవాలా..? అని ప్రశ్నించారు. ‘‘జులై 8న పార్టీ పెడుతున్నా.. ఆరోజే పాదయాత్ర చేసే తేదీ కూడా ప్రకటిస్తా.. నిరుద్యోగుల కోసమే పోరాటమే చేస్తా.. నా జీవితం బానే ఉంది.. కేవలం నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేకే పోరాటం చేస్తా..  సునీల్ నాయక్ బ్రతకాలని ప్రార్థనలు చేసా.. యువకులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీ కోసం పోరాటం చేస్తా.. బంగారు తెలంగాణ సాధ్యం చేస్తా..నాతోనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది.. 7 ఏళ్లు ఎదురు చూసినా.. కేసీఆర్ తో సాధ్యం కాదు..’’ అని షర్మిల అన్నారు. పోయిన ప్రతి ప్రాణం నాకు ముఖ్యమే, ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి సంఘీభావం తెలపాలి, తెలంగాణ లో ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలని వైఎస్ఆర్ కలలు కన్నారని, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.