సింగరేణిని ప్రైవేటుపరం చేయం

సింగరేణిని ప్రైవేటుపరం చేయం

హైదరాబాద్ /గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందంటూ హైదరాబాద్‌‌ నుంచి కొందరు  వక్రబుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సింగరేణి కాలరీస్ ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఎరువుల కోసం రైతులు అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు తాము రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉత్పత్తిని పెంచామని తెలిపారు. రూ.6,338 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని ప్రధాని మోడీ శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వీటితోపాటు మెదక్ – సిద్దిపేట – ఎల్కతుర్తి హైవే విస్తరణ, బోధన్–బాసర – భైంసా హైవే, సిరొంచ – మహాదేవపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ సభకు విచ్చేసిన రైతులు, సోదర, సోదరిమణులకు నమస్కారాలు’’ అంటూ చేతులెత్తి మొక్కుతూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. దేశంలోని రైతుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశామని, రానున్న రోజుల్లో మరో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. రెండున్నర సంవత్సరాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్నామని, ఇంకోవైపు యుద్ధాలు ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. అయినప్పటికీ మన దేశం ఆత్మవిశ్వాసంతో నయా భారత్ గా నిలిచిందని, ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో మౌలిక వసతుల కల్పనకే  ప్రాధాన్యమిచ్చామని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచామని తెలిపారు. తాము శంకుస్థాపనలకే పరిమితం కాలేదని, వేగంగా పూర్తి చేసి చూపించామని, 2016లో శంకుస్థాపన చేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సకాలంలో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. తాను ప్రారంభించిన ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ, నేషనల్ హైవేలు, రైల్వై లైన్లతో తెలంగాణలో అభివృద్ధితోపాటు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆయన అన్నారు. 

యూరియా బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం

ఏ భూమిలో ఎంత యూరియా వేసుకోవాలో తెలిసేలా భూసార పరీక్షలు చేసి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ‘‘2014 కు ముందు యూరియా కోసం దేశంలో రైతులు అనేక ఇబ్బందులుపడ్డారు. నేల స్వభావాన్నిబట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టాం. గతంలో ఎరువుల కోసం విదేశాల చుట్టూ తిరిగేవాళ్లం. గతంలో టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడంతో రామగుండం ఫ్యాక్టరీ మూత పడింది. అలాగే నకిలీ ఎరువులతో రైతులు నానా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో ఎరువుల పరిశ్రమను బలోపేతం చేసింది. మేం తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటెడ్ యూరియాను అందిస్తున్నాం.  విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. యూపీలోని గోరఖ్ పూర్ , తెలంగాణలోని రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలు సహా దేశంలోని ఐదు ఫ్యాక్టరీల నుంచి 70 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నాం” అని వివరించారు. రామగుండం ఫర్టిలైజర్స్​ ఫ్యాక్టరీ కేవలం తెలంగాణకే గాక ఆంధ్రప్రదేశ్ , కర్నాటక, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర రైతుల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. ఒకప్పుడు ఎరువుల కోసం అర్ధరాత్రి వరకు రైతులు క్యూ లైన్లలో నిల్చునేవారని, తాము తీసుకున్న చర్యలతో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించడం బందైందని తెలిపారు. యూరియా బ్లాక్​ మార్కెట్​పై  ఉక్కుపాదం మోపామని చెప్పారు. భవిష్యత్ లో మార్కెట్ లో ‘భారత్ యూరియా’ పేరుతో భారత్ బ్రాండ్ యూరియా ఒకటే  లభ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.

కొందరికి నిద్రపట్టదు

‘‘బొగ్గు గనుల విషయంలో కొందరు వక్రబుద్ధితో కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. హైదరాబాద్‌‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి  49 శాతం వాటానే ఉంది. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుంది. ప్రైవేటీకరణ చేయడం కేంద్రం చేతిలో లేదు. గత ప్రభుత్వాల హయాంలో బొగ్గు గనుల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు గనుల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా సాగుతున్నది” అని మోడీ చెప్పారు. ఈ మీటింగ్​కొచ్చినోళ్లను చూసి హైదరాబాద్​లో కొందరికి నిద్ర పట్టదని విమర్శించారు.