తిప్పికొట్టిన శివసేన
సీఎం పోస్ట్‌పై లొల్లి అట్లనే..
బీజేపీతో సేన చర్చలు రద్దు
మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటుపై బీజేపీ, శివసేన మధ్య చర్చలు, సంప్రదింపులకు టెంపరరీగా బ్రేకులు పడ్డాయి. కూటమిగా పోటీచేసిన రెండు పార్టీలు ఈనెల 21న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించాయి. అయితే సీఎం పోస్ట్‌పై రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతోంది. చెరో రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని పంచుకోవాలని శివసేన పట్టుపడుతోంది. ఈ కండిషన్‌కు బీజేపీ అంగీకరించడంలేదు. సీఎం పోస్ట్ కోసం మిత్రపక్షమైన శివసేన చెబుతున్నట్టు 50-:50 ఫార్ములాను అమలుచేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. దీంతో బీజేపీతో మంగళవారం జరగాల్సిన మీటింగ్‌ను శివసేన రద్దుచేసుకుంది. ఫడ్నవీస్ కామెంట్స్ వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్‌కు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ నేత భూపేంద్ర యాదవ్, శివసేన తరపున సుభాశ్ దేశాయ్, సంజయ్ రౌత్‌లు హాజరుకావాల్సి ఉంది.
నేనే సీఎం: ఫడ్నవీస్
చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. సీఎం పోస్ట్ కోసం మిత్రపక్షమైన శివసేన చెబుతున్నట్టు 50:-50 ఫార్ములాను అమలుచేసే ప్రశ్నేలేదని మంగళవారం క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. సీఎం పోస్ట్ విషయంలోగాని, పదవీకాలాన్ని చెరి సగం పంచుకునే విషయంలో గాని శివసేనకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఫడ్నవీస్ చెప్పారు. ‘‘ఎలాంటి డౌట్ లేదు. నేనే సీఎంను. ప్లాన్ ‘బీ’ , ప్లాన్ ‘సీ’ లేనేలేదు. ‘ ఏ’ ప్లాన్ ఒక్కటే ఉంది. అదే వర్క్ అవుట్ అవుతుంది’’ అని ఫడ్నవీస్ వివరించారు. కొత్త లీడర్‌ను ఎన్నుకునేందుకు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ బుధవారం జరుగుతుందని ఆయన చెప్పారు. రెండు పార్టీల మధ్య అధికారం పంచుకునే విషయంలో శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్‌పైనా ఫడ్నవీస్ సీరియస్ అయ్యారు. ‘‘ఐదేళ్లపాటు సీఎం పోస్ట్ కావాలని శివసేన కోరుకోవచ్చు. కోరుకోవడం వేరు.. సంపాదించడం వేరు. సీఎం పోస్ట్ కోసం 50:50 ఫార్ములా అమలుచేస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదు. వాళ్లు డిమాండ్స్ తో రావొచ్చు. అవసరాల్ని బట్టి మేం వాటిపై చర్చిస్తాం’’ అని ఫడ్నవీస్ వివరించారు.
‘దుష్యంత్’లు లేరిక్కడ: శివసేన
అధికారం పంచుకునే విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడిన వెంటనే బీజేపీపై శివసేన ఫైర్ అయింది. 50:50 ఎగ్రిమెంట్ జరగలేదన్న ఫడ్నవీస్ మాటలన్నీ అబద్ధాలేనని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. తమకు ఇతర ఆప్షన్లు ఉన్నప్పటికీ వాటిని అంగీకరించడం సబబు కాదని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ‘దుష్యంత్’లు మహారాష్ట్రలో లేరని, తమ తండ్రి జైలులోనూ లేడని ఆయన కామెంట్ చేశారు. హర్యానాలో దుష్యంత్ చౌతాలా జేజేపీ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో జైలుకు వెళ్లి 14 రోజుల ఫర్లాఫ్‌పై బయటకు వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రౌత్ ఈ మాటలన్నారు.
మాకు 45 మంది సేన ఎమ్మెల్యేల సపోర్ట్
బీజేపీతో చేతులు కలపడానికి శివసేనకు చెందిన 45 మంది కొత్త ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారని బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే బాంబు పేల్చారు. వీళ్లంతా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంజయ్.. శివసేన ప్రతిపక్షంలో కూర్చుకుంటుందని తాను అనుకోవడంలేదని అన్నారు.
‘శివసేన అడిగితే చర్చిస్తాం’
మహారాష్ర్టలో సీఎం పోస్టు కోసం బీజేపీ, శివసేన మధ్య వాదులాట జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. శివసేన ఏదైనా ప్రతిపాదనతో వస్తే.. దానిపై కాంగ్రెస్ హై కమాండ్, తమ మిత్రపక్షాలతో చర్చిస్తామని మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ అన్నారు. ఇప్పటివరకైతే శివసేన నుంచి ఎలాంటి ప్రపోజల్ రాలేదని చెప్పారు.
