చెక్​డ్యాంలు కొట్టుకపోతున్నయ్

చెక్​డ్యాంలు కొట్టుకపోతున్నయ్
  • క్వాలిటీ లేక వరదలకు తెగుతున్నయ్​
  • సైడ్‌ వాల్స్‌ కట్టకపోవడంతో మునుగుతున్న పంటలు
  • అనుభవం లేనోళ్లకు పనులు.. చూసీచూడనట్టు ఆఫీసర్లు
  • చాలా చోట్ల టీఆర్‌ఎస్‌ లీడర్లే కాంట్రాక్టర్లు
  • రాష్ట్రంలో రూ. 2,500 కోట్లతో 610 చెక్‌ డ్యాంల నిర్మాణం

రాజన్నసిరిసిల్ల/నెట్ వర్క్, వెలుగు: రాష్ట్రంలో వాగులు, వంకలపై కడుతున్న చెక్‌ డ్యాంలు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి. క్వాలిటీ లేకుండా నిర్మిస్తుండటంతో వరదలకు నామరూపాల్లేకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల సైడ్‌ వాల్స్‌ కట్టకపోవడంతో చెక్‌ డ్యాంలు పగిలి పంటలు మునుగుతున్నాయి. వానాకాలం మొదలవడానికి ముందే పూర్తవ్వాల్సిన పనులను ఇంకా చేస్తుండటంతోనే ఇట్లాంటి పరిస్థితి వస్తోందని రైతులు మండిపడుతున్నారు. అనుభవం లేనోళ్లకు పనులివ్వడం, ఆఫీసర్లు ఆ పనులను చెక్‌ చేయకపోవడంతో తాము ఆగమైపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చాలా చోట్ల టీఆర్‌ఎస్‌ లీడర్లే కాంట్రాక్టు పనులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఓవైపు చెక్‌ డ్యామ్‌లు తెగిపోతుంటే ఇంకోవైపు కాంట్రాక్టర్లకు బిల్లులు రెడీ చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.  
రాష్ట్రవ్యాప్తంగా 1,200 చెక్‌ డ్యాంలు
రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకాన్ని బంద్ పెట్టిన ప్రభుత్వం.. ఆ స్థానంలో చెక్ డ్యాంలను కడుతోంది. 1,200 చెక్ డ్యాంలు కట్టాలని నిర్ణయించి.. 610 డ్యాంలకు గతేడాది టెండర్లు పిలిచింది. వీటికి రూ.2,500 కోట్లు కేటాయించడంతో చాలా చోట్ల ప్రజాప్రతినిధుల బినామీలు, టీఆర్‌ఎస్ లీడర్లే కాంట్రాక్టులు దక్కించుకున్నారు. వీళ్లలో చాలా మంది క్వాలిటీ పాటించట్లేదని ఆరోపణలున్నాయి. జూన్‌లో వానాకాలం సీజన్ 
ప్రారంభమయ్యే నాటికి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్లు ఇంకా పనులు చేస్తుండటంతో నష్టం ఎక్కువగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో కడుతున్న చెక్ డ్యాంలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ అధికార పార్టీ లీడర్లు కావడంతో చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు వెనుకాడుతున్నారు. 
మానేరు నదిలో ఒక్క వరదకే పుటుక్కుమన్నయ్ 
మానేరు నదిలో కోట్లు పెట్టి కడుతున్న చెక్ డ్యాంలు ఇటీవలి ఒక్క వరదకే కొట్టుకుపోయాయి. మానేరు రివర్ ​ఫ్రంట్‌‌లో భాగంగా కరీంనగర్‌‌ నుంచి మానకొండూర్‌‌ మండలం వేగురుపల్లి వరకు నీరు నిల్వ ఉండేలా రూ. 12 కోట్ల వ్యయంతో భారీ చెక్‌‌ డ్యాం నిర్మాణం చేపట్టారు. చెక్ డ్యాంతో పాటు నీళ్లు పక్కకు వెళ్లకుండా రీటెయినింగ్ వాల్ కడుతున్నారు. కానీ ఇటీవలి వర్షాలకు లోయర్ మానేరు డ్యాం నిండి 18 గేట్లు ఎత్తడంతో రీటెయినింగ్​వాల్ ముక్కలు ముక్కలై నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల వద్ద మానేరు వాగుపై రూ. 16 కోట్లతో కడుతున్న చెక్ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ ఇటీవల మానేరు గేట్లు ఎత్తడంతో కట్ట నిలువునా రెండు ముక్కలైంది. కాంట్రాక్టర్ హడావుడిగా పనులు పూర్తి చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. 
సిరిసిల్ల జిల్లాలో రెండుగా చీలిన చెక్​డ్యాం
మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.150 కోట్లతో 24 చెక్ డ్యాంలు మంజూరయ్యాయి. వీటిలో 4 చెక్ డ్యాంలకు నిరుడుటెండర్లు నిర్వహించారు. పనులను ఓ కాంట్రాక్టర్​దక్కించుకోగా రద్దు చేసి టీఆర్ఎస్ నేతలకు అప్పగించారు. ఎప్పుడో ఎండాకాలంలో ప్రారంభించాల్సిన పనులను ఈ వర్షాకాలంలో స్టార్ట్‌‌ చేశారు. అవగాహన లేకుండా పనులు చేస్తుండటంతో నిర్మాణ దశలోనే డ్యాంలు కూలుతున్నాయి. తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్‌‌లో ప్రభుత్వ పెద్దకు బంధువైన కాంట్రాక్టర్ చెక్ డ్యాం పనులను ఆలస్యంగా మే నెలలో ప్రారంభించారు. 10 ఫీట్లకు పైగా చెక్ ​డ్యాం కట్టారు. డ్యాం కింద బేస్ ​నిర్మించే క్రమంలో నీళ్లు తోడి పనులు చేయాల్సి ఉండగా నీళ్లలోనే సిమెంట్ కాంక్రీట్​ పోసి పనులు చేయడంతో క్వాలిటీ దెబ్బతిన్నది. దీంతో ఇటీవలి వానలకు నర్మాల డ్యాం నిండి మానేరు వాగు పారడంతో కస్బె కట్కూర్‌‌లో రూ. 10.93 కోట్లతో నిర్మిస్తున్న ఈ చెక్ డ్యాం పూర్తి కాకముందే రెండు ముక్కలైంది. చెక్ డ్యాం కూలిపోతుందనే భయంతో కాంట్రాక్టర్ నీటిని మళ్లించేందుకు పక్కన మట్టి తీసేయడంతో ఆ ప్రవాహంతో నాలుగెకరాల పొలం దెబ్బతింది. చెక్ డ్యాం పూర్తి కాకముందే కూలిపోతున్నా రూ.2.5 కోట్ల బిల్లులు చెల్లించేందుకు ఆఫీసర్లు రంగం సిద్ధం చేశారు.
మిగిలిన జిల్లాల్లోనూ ఇదే సీన్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల శివారులోని పాకాల వాగుపై రూ. 2 కోట్లతో కడుతున్న చెక్ డ్యాం ఇటీవలి వరదలకు కొట్టుకుపోయింది. 70 శాతం పనులు పూర్తవడంతో కాంట్రాక్టర్‌‌కు రూ. 1.30 కోట్ల బిల్లులు చెల్లించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి వద్ద మోయ తుమ్మెద వాగుపై 6.50 కోట్లతో కట్టిన చెక్ డ్యాంను 6 నెలల కింద ప్రారంభించారు. వరదలకు చెక్ డ్యాంను ఆనుకుని ఉన్న మట్టి కట్ట మొత్తం కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడుకోల్​ కప్పల వాగుపై రూ. 5 . 54కోట్లతో కట్టిన చెక్ డ్యాం వరదలకు దెబ్బతింది. మెదక్ జిల్లాలో మంజీరా నది, హల్దీ వాగు మీద 119 కోట్లతో 15 చెక్​ డ్యాంలు మంజూరు కాగా వాటిలో 7 పూర్తయ్యాయి. మరో 8 డ్యామ్‌‌లున్నాయి. ఈ లోపే మంజీరాకు వరద రావడం, సింగూరు నీటిని రిలీజ్ చేయడంతో చిలప్ చెడ్ మండలం అజ్జమర్రి, ఫైజాబాద్, చండూర్, చిట్కుల్.. కొల్చారం మండలం పైతర, కోనాపూర్, హవేలి.. ఘనపూర్ మండలం సర్ధన వద్ద మంజీరాపై చేపట్టిన చెక్​డ్యాంలు దెబ్బతిన్నాయి. 

క్వాలిటీ పాటిస్తున్నం 
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెక్ డ్యాంల నిర్మాణాల్లో క్వాలిటీ పాటిస్తున్నం. అనుకోకుండా మానేరు వాగు పారడంతో కస్బె కట్కూర్ చెక్ డ్యాం మధ్యలో కూలింది. దాన్ని కాంట్రాక్టర్‌‌తో మళ్లీ కట్టిస్తం. తొలి విడత పనులకు సంబంధించి బిల్లులు ఇంకా చెల్లించలేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్​కాము. ఈ చెక్ డ్యాం వల్ల భూములు, పంట నష్టపోయిన రైతులకు కాంట్రాక్టర్ న్యాయం చేసేలా చూస్తం. 
                                                                                                                                                                                -  అమరేందర్​రెడ్డి, ఇరిగేషన్​ఈఈ, రాజన్న సిరిసిల్ల
మళ్లీ కడ్తం
కస్బె కట్కూర్‌‌లో కడుతున్న చెక్ డ్యాంకు నిర్మాణ దశలోనే రైతుల నుంచి ఇబ్బందులు వచ్చాయి. స్థానిక సమస్యలతో 2 నెలలు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. అయినా ఆపకుండా పనులు చేశాం. నర్మాల ప్రాజెక్టును ఏప్రిల్‌‌లోనే నింపుతారని అనుకోలేదు. వర్షాలు కూడా రావడంతో వరద వచ్చి ఇలా జరిగింది. మళ్లీ క్వాలిటీగా నిర్మిస్తాం.
                                                                                                                                                                                                                         - జోగినిపల్లి కరుణాకర్‌‌రావు, కాంట్రాక్టర్, కొదురుపాక