వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కంపెనీలు

వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కంపెనీలు

ఆయా రాష్ట్రాలు తమ సొంతంగా వ్యాక్సిన్ సమకూర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న సూచించింది. దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కేరళ మొత్తం 9 రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కోసం టెండర్లు పిలిచాయి. ఈ తొమ్మిది రాష్ట్రాలు 28.7 కోట్ల వ్యాక్సిన్లకు టెండర్లు పిలిచాయి. టెండర్లు పిలిచి కూడా ఒక నెల పూర్తయింది. అయితే కొన్ని కంపెనీలు అసలు రాష్ట్రాలతో డీల్‌కు ససేమిరా అంటుంటే, మరి కొన్ని కంపెనీలు మాత్రం తమ వద్ద స్టాక్‌లేదని స్పష్టం చేశాయి. ఏవిధంగా చూసినా తాము 2022 వరకు వ్యాక్సిన్లు సరఫరా చేయలేమని ఫైజర్‌ పేర్కొంది. ఇతర కంపెనీలు కూడా వివిధ దేశాలతో డీల్‌ కుదుర్చుకున్నాయి. కాబట్టి ఆ దేశాలకు సరఫరా చేసిన తరవాతే మీకు సరఫరా గురించి ఆలోచిస్తామని తెలిపాయి. ఏ దేశంలోనూ రాష్ట్రాలు సొంతంగా కంపెనీలతో ఒప్పందం చేసుకోలేదని.. అమెరికా సైతం రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తోందని వివిధ కంపెనీలు పేర్కొంటున్నాయి. మరోవైపు యూరప్‌, ఆఫ్రికా ఖండాల్లో దేశాలన్నీ ఒక గ్రూప్‌గా మారి టెండర్లు వేస్తున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో భిన్నంగా ప్రవర్తిస్తోంది. దాంతో కంపెనీలు వ్యాక్సిన్ సరఫరా చేయలేమని చేతులెత్తేశాయి. అసలు ఏ కంపెనీ కూడా వ్యాక్సిన్ సరఫరాకు టెండర్ వేయకపోవడంతో నెల రోజుల సమయం వృధా అయిందని నిపుణులు అంటున్నారు. 

కాగా.. ఈ ఏడాది చివరికల్లా 216 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ప్రజలకు అందిస్తామని కేంద్ర మంత్రులు హామి ఇచ్చారు. అలాంటప్పుడు ఆ టార్గెట్‌ను ఎలా చేరుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.