ఈ దీపావళికి ధూమ్ ధామ్ నై!..  సురసుర బత్తి.. చిచ్చుబుడ్డి మాత్రమే

ఈ దీపావళికి ధూమ్ ధామ్ నై!..  సురసుర బత్తి.. చిచ్చుబుడ్డి మాత్రమే

ఢిల్లీ: ఈ దీపావళి ధూమ్ ధామ్ గా చేయడానికి లేదు. పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చే పటాకులు కాల్చడానికి లేదు. సుయ్ మని రాకెట్లు వేయడం అసలే కుదరదు. సైలెంట్ గా దీపాల కళకళ.. రెండే రకాల ‘సైలెంట్’ గ్రీన్ క్రాకర్స్ అంతే!!.. కాలుష్యం, భారీ శబ్ధాలు లేకుండా దీపావళి ముగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయబోతున్నారు ఢిల్లీ పోలీసులు.

పటాకులు వద్దని.. సుప్రీం కోర్టుకు పిల్లలు

ఢిల్లీలో చలికాలం వస్తే భారీగా కాలుష్యంతో పొగ నిండిపోయి.. గాలి పీలిస్తే వెంటనే రోగం వచ్చేస్తుందేమో అనేలా తయారైంది పరిస్థితి.  ఈ నేపథ్యంలో దీపావళి టపాకాయలతో కాలుష్యం మరీ ఎక్కువైపోతోందంటూ 2016  ముగ్గురు పిల్లలు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. పిల్లల అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం దీపావళికి ఢిల్లీలో పటాకులు కాల్చడాన్ని నిషేధించింది. ఆ తర్వాత మళ్లీ కొద్ది సడలింపు మాత్రమే ఇచ్చింది.

సురసుర బత్తి.. చిచ్చుబుడ్డి మాత్రమే

ఢిల్లీలో దీపావళికి  రాకెట్లు, బాంబులు కాల్చడం పూర్తిగా నిషేధం ఉందని పోలీసు అధికారులు చెప్పారు. కేవలం ప్రభుత్వ స్టాంపుతో వచ్చిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కొనాలని ప్రజలకు సూచించారు.

అవి కూడా సురసుర బత్తి, చిచ్చుబుడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. 50 సురసుర బత్తీలు లేదా 5 చిచ్చుబుడ్డీలతో కూడిన బాక్స్ రూ.250కి వస్తుందన్ని దానిపై ప్రభుత్వం ముద్రించిన క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. దానితో పాటు ప్రభుత్వ స్టాంప్ చూసి కొనుగోలు చేయాలని తెలిపారు.

వేరే క్రాకర్స్ అమ్మితే కఠిన చర్యలు

మార్కెట్ లో కేవలం ఈ రెండు రకాల గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఎంఎస్ రాంధవా తెలిపారు. ఈ నిబంధనను పట్టించుకోకుండా వేరే క్రాకర్స్ ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మూమూలు క్రాకర్స్ తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ 30 శాతం తక్కువ కాలుష్యన్ని విడుదల చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. సుప్రీం తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సంస్థ ఈ గ్రీన్ క్రాకర్స్ ని తయారు చేసింది.