సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సెప్టెంబరు నెల జీతాలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో పాల్గొనకుండా విధుల్లో ఉన్న ఉద్యోగులకు పాతం జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ఇవాళ సీఎం కీసీఆర్ ఆర్టీసీపై సమీక్షించారు. ఆర్టీసీలో సమ్మెకు దూరంగా ఉన్న వారికి జీతం జమ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మె అని, దీనిని ప్రభుత్వం గుర్తించదని కేసీఆర్ స్పష్టం చేశారు. వారంతట వారే కార్మికులు ఉద్యోగాలు వదిలేసుకుని వెళ్లిపోయారని, వారితో సమస్యలపై ఇక చర్చించేది లేదని చెప్పారు. వాళ్లు ఇప్పుడు తిరిగి ఉద్యోగాల్లో చేరుతామన్నా తీసుకునే ప్రసక్తే లేదన్నారు.

వారికి లేనట్టేనా?
ఈ నెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబరు నెలకు సంబంధించిన జీతాలకు కూడా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో గత నెల జీతాలపై కార్మికుల్లో ఆందోళన నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు. సమ్మెలో ఉన్న కార్మికుల పాత నెల జీతం ఇన్ని రోజులు ఆపడంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇవాళ సమ్మెకు వెళ్లని వాళ్లకు జీతాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అంటే సమ్మెలో పాల్గొన్నవారికి జీతాలు లేనట్టేనని తెలుస్తోంది. దాదాపు 1200 మంది ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే సమ్మెకు దూరంగా ఉన్నారు. 48 వేల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
