కర్ణాటకలో వీకెండ్స్‌ లిక్కర్ సేల్స్‌ బంద్

కర్ణాటకలో వీకెండ్స్‌ లిక్కర్ సేల్స్‌ బంద్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, మరి కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలవుతోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ వీకెండ్ కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. వీకెండ్స్‌లో కర్ఫ్యూ అమలు నేపథ్యంలో అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహా అన్నీ క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి అవసరాలు ఉంటేనే జనం బయటకు రావాలని సూచించింది. అయితే ఈ క్రమంలో వీకెండ్స్‌ కర్ఫ్యూ అమలులో ఉండే రోజుల్లో ఇకపై లిక్కర్‌‌ సేల్స్‌ను నిలిపేయాలని నిర్ణయించినట్లు కర్ణాటక ఎక్సైజ్ మినిస్టర్ కే గోపాలయ్య తెలిపారు. ఈ మేరకు ఎక్కడా లిక్కర్ షాపులు ఓపెన్ చేయనీయకుండా, సేల్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని గోపాలయ్య తెలిపారు. తమ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని  లిక్కర్ షాపుల ఓనర్లు కోరారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్‌ను బయటకు రాకుండా అడ్డుకునేందుకు వాళ్ల విజ్ఞప్తిని పక్కనబెట్టామని చెప్పారు.

కర్ఫ్యూ టైమ్‌లో బయటకొస్తే బండి సీజ్

వీకెండ్ కర్ఫ్యూ టైమ్‌లో నిత్యవసర, అత్యవసర సేవలు, మెడికల్ సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని బెంగళరు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని, ప్రజలు తమ సేఫ్టీ కోసమైనా పోలీసులు, అధికారులక సహకరించాలని కోరారు. సిటీలో ఎవరైనా ఆస్పత్రులకు వెళ్లేందుకు  బయటకు వస్తే సరైన డాక్యుమెంట్లను చూపించాలని అన్నారు. అనవసరంగా ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే బయటికొచ్చి వారిని అరెస్ట్ చేస్తామని, వారి వెహికల్‌ను సీజ్ చేస్తామని పంత్ తెలిపారు.