
- ఏడాదిగా వేతనాల్లేక డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల గోస
- కొత్త వాళ్ల కోసం విద్యా శాఖ నోటిఫికేషన్
- ఇదేం తీరంటూ ఫ్యాకల్టీల ఆవేదన
- నెలన్నర కిందే నిధులు విడుదలైనా అందని శాలరీ
హైదరాబాద్, వెలుగు: జీతాలందక సతమతమవుతున్న గెస్ట్ లెక్చరర్లకు ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. పాత వాళ్లను కాదని కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి కళాశాల విద్యా శాఖ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉన్న జాబూకూ ఎసరొచ్చింది. ఏడాదిగా వేతనాలు లేకుండా పని చేసినా ప్రభుత్వం గుర్తించకుండా వ్యవహరిస్తోందని ఫ్యాకల్టీ ఆవేదన చెందుతున్నారు.
రూ.18 కోట్లిచ్చిన సర్కారు
రాష్ట్రంలో132 సర్కారీ డిగ్రీ కాలేజీలున్నాయి. వెయ్యి మందికిపైగా గెస్ట్ లెక్చరర్లు అవర్లీ బేసిస్‌పై పని చేస్తు్న్నారు. వీళ్లలో 863 మందికి ప్రభుత్వం అనుమతివ్వగా మిగిలిన వాళ్లను అవసరాలకు అనుగుణంగా ప్రిన్సిపల్స్ నియమించుకున్నారు. ఒక్కో లెక్చరర్ నెలకు 72 క్లాసులు చెప్పాలి. ఒక్కో క్లాస్‌కు రూ.300 గౌరవ వేతనం ఇస్తారు. గతేడాది జులైలో వీళ్ల నియామకాలు జరిగాయి. కానీ ఇప్పటికీ జీతాలందలేదు. గెస్ట్ లెక్చరర్లు ఆందోళనలకు దిగడంతో గత నెల 14న ప్రభుత్వం రూ.18.64 కోట్లు విడుదల చేసింది. అప్పటికే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్స్ నుంచి వివరాలను విద్యా శాఖ తెప్పించుకున్నా ఎన్ని గంటలు పనిచేశారనే వివరాలను మరోసారి సేకరించారు. అయినా శాలరీలు రాలేదు. కొన్ని కాలేజీల ప్రిన్సిపల్స్ సరైన వివరాలివ్వలేదని, కాబట్టి ముందు 60 శాతం వేతనాలివ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిగిలిన 40శాతం తర్వాత ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కానీ దీన్ని గెస్ట్ లెక్చరర్లు వ్యతిరేకిస్తున్నారు. సర్కారు నిధులిచ్చాక అధికారులు ఆపడమేంటని ప్రశ్నిస్తున్నారు.
హైకోర్టు తీర్పిచ్చినా..
స్కూళ్లలో విద్యా వలంటీర్లు, జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను గతేడాది పనిచేసిన వారినే ఈ ఏడాదీ కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ కళాశాల విద్యా శాఖ మాత్రం ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయలేదు. పైగా కొత్త వారిని తీసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంతో పాత వాళ్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లెక్చరర్స్ లేక చాలా కాలేజీల్లో కొన్ని సబ్జెక్టుల బోధన జరగడం లేదు. జీతాలపై విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్స్ నుంచి ఇంకా వివరాలు అందలేదని, అందుకే జీతాలు ఇవ్వలేదని చెప్పారు. ముందుగా 60 శాతం జీతాలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని భావిస్తున్నామని, రెన్యూవల్ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు.