సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భరతం పడ్తం: సీపీ శ్రీనివాస్ రెడ్డి

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్  భరతం పడ్తం: సీపీ  శ్రీనివాస్ రెడ్డి
  • సినీ రంగ పెద్దలు  చూసీచూడనట్లు వదిలేస్తున్నరు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
  • డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతం
  • నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కామెంట్

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్​ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా కొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ‘‘సినిమా ఇండస్ట్రీలోని పెద్దలంతా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి. మేము కూడా మీటింగ్ పెట్టి చెప్తాం. కొందరు సినీ వర్గాల్లోని వాళ్లే ఇలాంటి పార్టీలను ప్రోత్సహిస్తున్నారు. చూసీ చూడనట్లు వ్యవహరించడం సరికాదు. పోలీసుల పని మనకెందుకులే అనే భావన చాలా మందిలో ఉంది. కానీ.. సమాజానికి హాని కలిగించే డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి సినీ పెద్దలు కూడా సహకరించాలి”అని సీపీ శ్రీనివాస్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సీపీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కు డిమాండ్ ఉండటంతోనే సప్లై ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ మూలాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విధంగా హైదరాబాద్​ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డ్రగ్స్ ముఠాలన్నీ స్టేట్ వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. డ్రగ్స్ ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎవరైనా చట్టం ముందు సమానమే..

‘‘సినీ ఇండస్ట్రీలో చాలా మంది మంచి వాళ్లు కూడా ఉన్నారు. డ్రగ్స్‌‌ వినియోగాన్ని సినీ పెద్దలు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. డ్రగ్స్ నివారణ కోసం వాళ్లంతా ముందుకు రావాలని కోరుతున్నాను. ఇలాంటి కార్యకలాపాలు నిలిపివేసేందుకు సినీ చాంబర్స్ పెద్దలు సహకరించాలి. వారితో మీటింగ్ పెట్టి మాట్లాడుతా. ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నది”అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబరాబాద్, రాచకొండ పోలీసులతో కలిసి పని చేస్తామన్నారు. గంజాయి పెద్ద మొత్తంలో సప్లై జరుగుతున్నదని తెలిపారు. దీనికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

పబ్స్, ఫామ్​హౌస్​లపై నిఘా ఉంటది

పబ్స్, ఫామ్​హౌస్, రెస్టారెంట్లపై నిఘా కొనసాగుతున్నదని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్ ముఠాలు, సప్లై చేసేవాళ్లంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపేయాలని హెచ్చరించారు. ఎవరైనా చట్టం ముందు సమానమే అని స్పష్టం చేశారు.  దీనికి ముందు, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత జాయింట్ ప్రెస్​మీట్​లో మాట్లాడారు. సైబరాబాద్​లో ఐటీ ఇండస్ట్రీ విస్తరించి ఉందని, సేఫ్ అండ్ సెక్యూరిటీ కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని సీపీ అవినాశ్ మహంతి అన్నారు. చట్టప్రకారం పని చేస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ కేసులపై స్పెషల్ ఫోకస్ పెడ్తామని, రౌడీ షీటర్స్​పై పటిష్టమైన నిఘా ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.