వానమ్మా.. రావమ్మ.. ఊరించి ఉసూరుమనిపించిన రుతుపవనాలు.. చినుకు తడిలేక మట్టిలోనే మాడిపోతున్న సీడ్స్

వానమ్మా.. రావమ్మ.. ఊరించి ఉసూరుమనిపించిన రుతుపవనాలు.. చినుకు తడిలేక మట్టిలోనే మాడిపోతున్న సీడ్స్
  • ఏరువాక మొదలై 10 రోజులు దాటినా జాడలేని వానలు 
  • ముందస్తు వర్షాలతో విత్తనాలు నాటిన రైతుల్లో దిగులు
  • చినుకు తడిలేక మట్టిలోనే మాడిపోతున్న సీడ్స్​
  • రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 41 శాతం లోటు వర్షపాతం
  • వరంగల్, హన్మకొండ సహా 13 జిల్లాల్లో అత్యధిక లోటు 
  • పలుచోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు  

కరీంనగర్/మహబూబాబాద్​, వెలుగు: రోహిణి కార్తెలో ముందస్తుగా మురిపించిన వానలు.. ఇప్పుడు  పత్తా లేకుండా పోయాయి. పది రోజుల ముందుగానే  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చినా..  మరో రెండు రోజుల్లో ఆరుద్ర కార్తెలోకి ప్రవేశిస్తున్నా చినుకు జాడలేదు. ఎవుసానికి అదును దాటుతున్నా భూమిలో పదునులేక రైతులు విత్తనాలు నాటలేకపోతున్నారు. ముందస్తు వర్షాలను నమ్మి పత్తి, పెసర, మక్క విత్తనాలు నాటిన రైతులు.. ఎండలతో ఇప్పుడవి మాడిపోతాయేమోనని బుగులు పడుతున్నారు. 

కాలం కంటే ముందే కురిసిన వర్షాలు ఊరించి ఉసూరుమనిపించాయని ఆవేదన చెందుతున్నారు. కాలం అవుతుందనే నమ్మకంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వాన ఎప్పుడు పడుతుందా అని మొగులు దిక్కు చూస్తున్నారు. పలుచోట్ల వర్షాల కోసం కప్పతల్లి ఆటలు  ఆడుతున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా గత 20 రోజుల్లో కురవాల్సిన సాధారాణ వర్షపాతం కన్నా 41 శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన  కలిగిస్తున్నది. కాగా, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జులై మొదటివారం కల్లా విత్తనాలు వేసుకోవచ్చని వ్యవసాధికారులు చెబుతున్నారు.   

26 జిల్లాల్లో లోటు వర్షపాతం..

రాష్ట్రంలో 2 వారాలుగా ఆశించిన స్థాయిలో వానలు కురవడం లేదు. రుతుపవనాల కదలిక మందగించడంతో అడపాదడపా తేలికపాటి వర్షాలు తప్పితే భారీ వర్షాలు పడడంలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 41 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 13 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల్లో 83.5 మిల్లి మీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. 49.84 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 

 41 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఇందులో అత్యధికంగా హనుమకొండ జిల్లా (సాధారణం:88.7 మిల్లీ మీటర్లు.. కురిసింది:16.6 మిల్లీ మీటర్లు), వరంగల్ జిల్లా (సాధారణం:96.6 మిల్లీ మీటరు.. కురిసింది:18.1)ల్లో 81 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే, సూర్యాపేట జిల్లాలో 74 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 74 శాతం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 73 శాతం, పెద్దపల్లి జిల్లాలో 72 శాతం, కరీంనగర్ జిల్లాలో 71 శాతం లోటు కనిపించింది. 

వీటితోపాటు ఖమ్మం, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, నల్గొండ, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి, సిద్దిపేట, జనగామ, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ సీజన్ లో ఒక్క మహబూబ్ నగర్ జిల్లా(సాధారణం:57.0 మిల్లీ మీటర్లు.. కురిసింది: 73.9 మిల్లీ మీటర్లు)లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో మెజార్టీ జిల్లాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. 

వాన కోసం ఎదురుచూపులు 

ఇప్పటికే పత్తి విత్తనాలు మొలకెత్తిన చోట్ల.. ఆ మొలకలు ఎండిపోకుండా రైతులు నీళ్లు పోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రింక్లర్లు తెచ్చి నీటితడులు అందిస్తున్నారు. బావుల్లో నీళ్లు కూడా అడుగంటడంతో  ఆ తడులకూ కష్టమవుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మబ్బులు కమ్ముకుంటున్నా వర్షాల జాడలేదని,  అప్పుడప్పుడు ఎండ కూడా దంచుతుండడంతో మొలకలు వాడుతున్నాయని చెప్తున్నారు. 

రాబోయే నాలుగైదు రోజుల్లో వాన పడకుంటే మొలకలన్నీ ఎండిపోతాయని, అప్పుడు పెట్టుబడులకూ మునుగుతామని వాపోతున్నారు. వాస్తవానికి ఈ సారి వర్షాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినప్పటికీ.. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. వచ్చే ఆరు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, జూన్ చివరలో లేదా జులై ఫస్ట్ వీక్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్తుండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.

విత్తనాలు కూడా మాడిపోయే ప్రమాదం.. 

చేన్లలో విత్తిన పత్తి విత్తనాలు 15 రోజుల వరకు వర్షాలు లేకపోయినా సేఫ్ గానే ఉంటాయి. వర్షాలు కురిస్తే తడి తగిలి మొలకెత్తుతాయి. 15 రోజులు దాటాక ఎండలు ఎక్కువగా ఉంటే విత్తిన పత్తి విత్తనాలు నేలలో వేడి పెరిగి మాడిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక విత్తనాలపైన లేయర్ పోతే పురుగులు, చీమలు కూడా వాటిని తినే అవకాశముందని చెప్తున్నారు. ఇలా కొన్ని విత్తనాలు వృథా అయితే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. విత్తనాలు మొలకెత్తకపోతే.. దున్నడానికి, విత్తనాల కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి కూడా వృథా అయ్యే అవకాశముంది.  


కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శివారులో రైతు చిట్టుకూరి శ్రీనివాస్ 12 రోజుల క్రితం 13 ఎకరాల్లో దుక్కి దున్నించి పత్తి విత్తనాలు పెట్టారు. కానీ విత్తనాలు ఎక్కడా మొలవలేదు. పక్కనే ఉన్న వ్యవసాయ పంప్ సెట్ వద్ద కాళ్లు కడుక్కోవడానికి మోటర్ ఆన్ చేసినప్పుడు నీళ్లు పారి ఒక వరుస పత్తి విత్తనాలు మొలకెత్తాయి. దీంతో లోపల ఎన్ని విత్తనాలు ఉన్నాయో.. ఎన్ని పోయాయో తెలియక ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు.  విత్తనాలు మొత్తం పోతే వానలు కురిశాక మళ్లీ దున్నడం, మళ్లీ కూలీలతో విత్తనాలు పెట్టించడం ఖర్చుతో కూడుకున్న పని అని,  13 ఎకరాల్లో విత్తనాలు నాటాలంటే మరో లక్షన్నర వరకు ఖర్చు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

నాలుగు ఎకరాల్లో  పత్తి గింజలు పెట్టిన


నాకున్న 4 ఎకరాల్లో పత్తి విత్తనాలు పెట్టిన.  ఎకరానికి 3 ప్యాకెట్ల చొప్పున తీసుకొచ్చిన. ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్​ను రూ.950 చొప్పున కొన్నా. రెండు వారాలుగా వర్షాల జాడ లేకపోవడంతో పత్తి గింజలు సరిగ్గా మొలకెత్తడం లేదు. దీంతో బోరు నీళ్లతో రోజుకు కొంత పత్తి సాళ్లను తడుపుతున్నాం. వర్షం కురిస్తే తప్పా సమస్య తీరేలా లేదు. బోళ్ల యాకన్న, కుమ్మరికుంట్ల, దంతాలపల్లి, మహబూబాబాద్ 

ఈ నెలాఖరు వరకు  పత్తి వేసుకోవచ్చు.. 

ఇప్పటికే పత్తి విత్తనాలు నాటిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే రెండు, మూడు రోజుల్లో వర్షం కురిసినా మొలకలు వచ్చేస్తాయి. అదను పోయిందని ఆందోళకు గురికావొద్దు. ఈ నెలఖారు లేదా జులై ఫస్ట్ వీక్ వరకు వర్షాలు కురిసినా పత్తి, ఇతర విత్తనాలు విత్తుకోవచ్చు. పంటలు వేసుకోవడానికి ఇంకా 10, 15 రోజుల టైమ్ ఉన్నది. 
- భాగ్యలక్ష్మి, 
జిల్లా వ్యవసాయాధికారి, కరీంనగర్