వైన్ షాపుల్లో నో స్టాక్.. బార్లలో డబుల్ రేట్

వైన్ షాపుల్లో నో స్టాక్.. బార్లలో డబుల్ రేట్

లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వైన్ షాపుల ముందు వినియోగదారులు బారులు తీరారు. అయితే జనం ఒక్కసారిగా ఎగబడటంతో స్టాక్ అయిపోయింది. దాంతో యజమానులు వైన్ షాపులను మూసివేశారు. గత్యంతరం లేక వినియోగదారులు బార్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బార్ షాపుల యజమానులు మద్యాన్ని డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. 

కరోనా తీవ్రతను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దాంతో వైన్ షాపుల ద‌గ్గ‌ర వినియోగదారులు భారీ క్యూ క‌డుతున్నారు. లాక్‌డౌన్ అని తెలియ‌డంతో వెంట‌నే ద‌గ్గ‌ర్లోని వైన్ షాపుల‌కు మద్యం కోసం పరుగులు పెడుతున్నారు. 10 రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్ ఉంటాయ‌ని ముందుగానే బాటిల్స్ కొనుపెట్టుకుంటున్నారు.  కొంతమంది అయితే 10 రోజుల‌కు స‌రిప‌డా మ‌ద్యం బాక్సులు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో జ‌నం ఎక్క‌డా కూడా సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డంలేదు. కొన్ని చోట్ల మాస్కులు కూడా పెట్టుకోవ‌డంలేద‌ని వైన్స్ షాప్స్ య‌జ‌మానులు చెబుతున్నారు. ర‌ద్దీ ఎక్కువ కావ‌డంతో షాపులు మూసివేస్తున్నారు. భారీగా క్యూలైన్లు ఉండ‌టంతో ప‌లుచోట్ల ట్రాఫిక్ కూడా జామ్ అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్ షాపుల ముందు ఇదే రద్దీ కొనసాగుతోంది.  

అయితే ఇటు వినియోగదారులు.. అటు మద్యం షాపుల యజమానుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ విషయం తెలియక మద్యం ప్రియులు.. షాపుల ముందు బారులు తీరుతున్నారు.