స్టాంప్​ పేపర్లు నో స్టాక్.. డబుల్ రేటుకు అమ్ముతున్న వెండర్లు

స్టాంప్​ పేపర్లు నో స్టాక్.. డబుల్ రేటుకు అమ్ముతున్న వెండర్లు

రిజిస్ట్రేషన్లు బంద్ కావడంతో 45 రోజులుగా ఆగిన

బ్లాక్​ చేసి డబుల్ రేటుకు అమ్ముతున్న పలువురు వెండర్లు

వివిధ అగ్రిమెంట్ల కోసం సామాన్యుల పాట్లు

మెట్​పల్లి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నాన్‌ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఎల్ఆర్ఎస్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మ్యారేజెస్, వీలునామాలు మినహా అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేసింది. ఈక్రమంలో45రోజులుగా స్టాంప్ వెండర్లకు స్టాంప్ పేపర్ల సప్లై ఆగిపోయింది. దీంతో అగ్రిమెంట్ల కోసం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బర్త్, డెత్ అఫిడవిట్ల కు స్టాంప్ పేపర్స్ ఇవ్వాల్సి ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా రూ.20, రూ.50, రూ.100 స్టాంప్‌ పేపర్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది.

డబుల్ రేట్లకు స్టాంప్ పేపర్ల అమ్మకాలు

ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​ పరిధిలో సుమారు పది మందికిపైగా స్టాంప్​ వెండర్స్​ ఉంటారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల పట్టణాల్లో ఏకంగా 30 మంది వరకు స్టాంప్ వెండర్స్ ప్రతి సంవత్సరం  దాదాపుగా రూ. 40 లక్షల విలువ గల స్టాంప్స్ పేపర్లను సేల్​ చేస్తున్నారు. స్టాంప్​ పేపర్ల సప్లై నిలిచిపోవడంతో వీరిలో కొంతమంది వెండర్లు ఉన్నవాటిని బ్లాక్​చేసి డబుల్ రేట్లకు అమ్ముకుంటున్నారు. రూ. 20 స్టాంప్ పేపర్ ను రూ.50కు, రూ. 50 స్టాంప్ పేపర్ ను రూ.100 కు, రూ. 100 స్టాంప్ పేపర్ ను రూ.200 నుంచి 250  వరకు విక్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు బంద్​ అయ్యాయని స్టాంప్​ పేపర్ల సప్లై ఆపడం సరికాదని, ప్రభుత్వ నిర్ణయంతో తాము నష్టపోతున్నామని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టాంప్​ పేపర్ల జారీ నిలిచింది..

ప్రస్తుతం సర్కారు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. అందువల్లే లైసెన్స్ వెండర్లకు స్టాంప్ పేపర్లు జారీ చేయడం లేదు. ఇప్పటికే స్టాంప్ పేపర్లు స్టాక్ ఉన్న వెండర్లు నిర్ణిత రేటు కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  సర్కారు నుంచి ఆదేశాలు రాగానే స్టాంప్ పేపర్లు సరఫరా చేస్తాం.  –కుక్కనూరి లక్ష్మి, ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్, మెట్ పల్లి

ఎక్కువ ధరకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి

స్టాంప్ పేపర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్కారు నుంచి సప్లై లేకపోవడంతో వెండర్లు బ్లాక్​లో అమ్ముతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి.  స్టాంప్ పేపర్లను బ్లాక్​లో ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. –కొమిరెడ్డి శేషు, వెంకట్రావుపేట

For More News..

మరో మూడు నెలలు ఉల్లితో లొల్లే

దళితులకు ఇచ్చేందుకు మూడెకరాలు లేవా?

10 వేల సాయం పంచుక తింటున్నరు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్​ పాసైతే చాలు ఇంజనీరింగ్‌లో చేరొచ్చు