నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నో స్టాక్

నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నో స్టాక్
  • ఆయిల్​కంపెనీల నుంచే సప్లై లేదంటున్న డీలర్లు
  • ఆఫీసర్లు రివ్యూ చేస్తున్నా కొరత తీరట్లే
  • ఆందోళన చెందుతున్న వినియోగదారులు, రైతులు

నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పెట్రోల్​బంకుల్లో ఎక్కడచూసినా నోస్టాక్​ బోర్డులే కనిపిస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్​ దొరకడం లేదని వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్​ కంపెనీల డీలర్లే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆఫీసర్లు పరిస్థితిపై రివ్యూ చేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. కంపెనీల నుంచే పెట్రోల్, డీజిల్​సప్లై కావడం లేదని, ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ తమను బదనాం చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. కోటా ప్రకారం రావాల్సిన డీజిల్, పెట్రోల్​మూడు రోజులకోసారి సప్లై చేస్తున్నారని, వచ్చిన కోటా వచ్చినట్టే అయిపోతుందని డీలర్లు అంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత కొరత ఏర్పడుతుందన్న ప్రచారం నేపథ్యంలో వచ్చిన స్టాక్​ రెండు, మూడు గంటల్లోనే అయిపోతోందని చెబుతున్నారు. నిన్నామొన్నటి వరకు కొన్ని కంపెనీల బంకులకే పరిమితమైన ఆయిల్​కొరత ఇప్పుడు అన్ని కంపెనీలకు పాకింది. హెచ్​పీ, భారత్​పెట్రోలియం, ఇండియన్​ఆయిల్​ బంకులు సైతం పెట్రోల్, డీజిల్​ లేక వెలవెలబోతున్నాయి. 
తగ్గిన సప్లై..
నల్గొండ జిల్లాలో 214 బంక్ లు ఉండగా, రోజుకు పెట్రోల్​ మూడు లక్షల లీటర్లు, డీజిల్​ 8 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం పెట్రోల్​ఐదు లక్షల లీటర్లు, డీజిల్​ పది లక్షల లీటర్లకు చేరాయి. బీపీసీఎల్​ కంపెనీ వద్ద మిషనరీ రిపేరు  ఉండటంతో హెచ్​పీసీఎస్​రిఫైనరీ నుంచి ఆయిల్​ సప్లై కావాల్సి ఉండగా.. అలా కావడం లేదని సేల్స్​మేనేజర్లు చెపుతున్నారు. పైగా ఆర్టీసీ, ఇతర పరిశ్రమలు సైతం బయట బంకుల్లోనే ఆయిల్​ కొంటుండటంతో వాడకం పెరిగింది. పైగా ఇంతకుముందులా క్రెడిట్​బేసిస్​లో కంపెనీలు అప్పు ఇవ్వడం లేదని, ముందు పైసలు కడితేనే ఆయిల్​ఇస్తున్నారని డీలర్లు మొత్తుకుంటున్నారు.  సూర్యాపేట జిల్లాలో 166 పెట్రోల్ బ్యాంకులు ఉండగా రోజుకు 6లక్షల లీటర్లు డీజిల్ సప్లై చేయాల్సి ఉండగా ప్రస్తుతం 4లక్షల లీటర్లే సరఫరా అవుతుంది. 
రూరల్​ ఏరియాల్లోనూ బంక్​లు ఖాళీ.. 
పట్టణాల్లోని బంక్​లో పెట్రోల్, డీజిల్​కు సమస్య రాకుండా కొంత జాగ్రత్త పడుతున్నా రూరల్​ ఏరియాల్లో బంక్​లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయ పనులు మొదలుకావడంతో డీజిల్​ వాడకం పెరిగింది. ఆఫీసర్లు ఇప్పటికే రెండు, మూడు సార్లు సేల్స్​మేనేజర్లు, డీలర్లతో చర్చించారు. కానీ పరిస్థతి కంట్రోల్​కాకపోవడంతో సమస్యను సివిల్​ సప్లై కమిషనర్​కు రిపోర్ట్​ చేస్తున్నారు. 
కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం 
పెట్రోల్, డీజిల్​ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు ఆందోళన చెందొద్దు. కంపెనీల నుంచే సప్లై తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా కొరత ఏర్పడుతోంది. అత్యవసర సేవలకు అవసరమయ్యేలా స్టాక్​ పెట్టుకోవాలని డీలర్లను ఆదేశించాం. రెండు, మూడురోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. జిల్లాలో వాడకం పెరిగి న దృష్ట్యా కొరత రాకుండా చూడాలని కమిషనర్​కు రిపోర్ట్​ పంపాం.  - వెంకటేశ్వర్లు, డీఎస్​ఓ