రేవంత్ సర్కార్ కు ఢోకా లేదు : చిలుకూరు శ్రీనివాస మూర్తి

రేవంత్ సర్కార్ కు ఢోకా లేదు : చిలుకూరు శ్రీనివాస మూర్తి
  • సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత.. గాంధీ భవన్​లో చిలుకూరు శ్రీనివాస మూర్తి పంచాంగ శ్రవణం
  •     ప్రజల ఆశీర్వాదంతో నడుస్తున్న ప్రభుత్వం ఇది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా రాష్ట్ర బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టి
  •     విప్లవాత్మకమైన బడ్జెట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: రేవంత్ సర్కార్​కు ఢోకా లేదని, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉందని గురువారం గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన పండితుడు చిలుకూరు శ్రీనివాస మూర్తి అన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస మూర్తి పంచాంగ శ్రవణం చేస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆనందంగా ఉంటారని, రైతుకు పండిన పంటకు మంచి ఫలితం అందుతుందన్నారు. వాణిజ్య పంటలు ఈ ఏడాది సమృద్ధిగా పండుతాయన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఈ ఏడాది కొత్త పదవులు చేపడుతారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆయన ఆదేశాలను పాటిస్తూ పనిచేయాలని కోరారు. రాశిఫలాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయన్నారు. తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. 

ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు. పరాభవ నామ సంవత్సరంలో ఎవరూ.. ఎవర్ని పరాభవించకుండా అంతా కలిసికట్టుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మట్లాడుతూ.. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండనుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. 

అభివృద్ధికి దిక్సూచిగా బడ్జెట్: వివేక్ వెంకటస్వామి 

శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ‘విప్లవాత్మకమైన’ బడ్జెట్​గా మంత్రి వివేక్ వెంకటస్వామి అభివర్ణించారు. ఈ బడ్జెట్ తెలంగాణ అభివృద్ధికి దిక్సూచిగా నిలవనుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎప్పుడు వెనక్కి వెళ్లలేదన్నారు. ప్రజా పాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝన్సీ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి సహా పలువురు పీసీసీ నేతలు పాల్గొన్నారు.