ధరణిలో ఎక్కడి సమస్యలు అక్కడే

ధరణిలో ఎక్కడి సమస్యలు అక్కడే
  • దారి చూపని ధరణి.. భూముల సమస్యలు ఎక్కడివిక్కడే
  • రోజుకు 500కు పైగా ఫిర్యాదులు.. అన్నీ పెండింగ్‌లోనే..
  • మూడు, నాలుగు సార్లు అప్లై చేసుకున్నా పరిష్కరిస్తలే
  • కొన్ని సార్లు అప్లికేషన్లు గాయబ్..
  • ఎమ్మార్వో ఆఫీసుకు పోతే కలెక్టర్ పేరు..  కలెక్టర్ ఆఫీసుకు పోతే సీసీఎల్ఏ, సర్కార్ ​పేరు
  • మంత్రులకు ట్విట్టర్‌‌లో మొరపెట్టుకున్నా.. మారని పరిస్థితి
  • రైతుబంధు రాక, క్రాప్​లోన్ అందక.. అవసరాలకు భూములు అమ్ముకోలేక రైతుల ఇక్కట్లు

హైదరాబాద్, వెలుగు: ధరణితో సమస్యలు తీరడం లేదు. పరిష్కారాలు దొరకడం లేదు. భూముల సమస్యల పరిష్కారానికి పోర్టల్ లో ఆప్షన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఫిర్యాదులు తీసుకోవడంతోనే సరిపెడుతోంది. సమస్యలను పరిష్కరించడం లేదు. ఒక్కో రైతు మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసినా ఇదే పరిస్థితి. ధరణి పోర్టల్‌లోని గ్రీవెన్సెస్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యుల్ ద్వారా రోజూ 500 దరఖాస్తులు వస్తున్నా.. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇవన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రతి అప్లికేషన్ కలెక్టర్ల లాగిన్‌లోకి వెళ్తుందని, సమస్యను బట్టి అక్కడి నుంచి ఎమ్మార్వో కు ఫార్వర్డ్ అవుతుందని చెప్పడమే తప్ప చేస్తున్నదేమీ లేదు. ఇప్పటికే పలు రకాలుగా భూ సమస్యలపై అప్లికేషన్లు పెట్టుకున్నామని, అసలు వాటి స్టేటస్ ఏంటో కూడా అధికారులు చెప్పడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్​లో స్టేటస్ తెలుసుకునేందుకు అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే.. నంబర్ వ్యాలిడ్ కాదని వస్తోందని, ఎమ్మార్వో ఆఫీసుకు వెళితే కలెక్టర్ పేరు చెప్పడం, అక్కడికి వెళితే తమకు సీసీఎల్‌ఏ నుంచి, సర్కారు నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదని సమాధానం వస్తోందని అంటున్నారు. వారానికి రెండు, మూడు రోజులు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నామని, అయినా ఏం లాభం లేదని వాపోతున్నరు. ‘మంత్రి చెప్పినా పని జరగదా సార్’ అని ప్రశ్నిస్తే.. ధరణిలో అప్షన్ లేకపోతే ఎవరు ఏం చెప్పినా ఏం చేయలేమని ఆఫీసర్లు తేల్చిచెప్తున్నారు.

నాలుగు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా..

భూసమస్యలపై అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. ధరణి వచ్చిన కొత్తలోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెట్టుకునేందుకు ఆప్షన్లు ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు తొలగించారు. అందులో పెట్టుకున్న అప్లికేషన్లకు అతీగతి లేకుండా పోయింది. దీంతో రైతుల పిల్లలు చాలా మంది మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌‌‌‌కు ధరణి సమస్యలను ఏకరువు పెట్టారు. స్పందించిన సీఎస్ వెంటనే వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ ప్రకటించి ఆప్లికేషన్లు తీసుకున్నారు. పది రోజుల్లో 23 వేల పైనే అప్లికేషన్లు వచ్చాయి. అందులో డిజిటల్ సైన్ వంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని పరిష్కరించి మిగతావన్నీ పక్కన పెట్టేశారు. పైగా మళ్లీ మీ సేవకు వెళ్లి అప్లై చేసుకోవాలని మెస్సేజ్ లు పంపి చేతులు దులుపుకున్నారు. అక్కడికి వెళ్తే ఆప్షన్లు కనిపించలేదు. ఈ క్రమంలోనే జూన్ 28న ఏ భూ సమస్య అయినా చెప్పుకోవచ్చని ఆప్షన్ ఇచ్చారు. అందులో నాలుగు రకాల సమస్యలను ప్రస్తావించారు. ఈ నెల మూడో తేదీన ఆ మాడ్యుల్ లో మార్పులు చేసి మరిన్ని ఇష్యూస్ ను చేర్చారు. ఏ ఇష్యూ కిందకు రాకుంటే అదర్స్ కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకునే అవకాశమిచ్చారు. కానీ వచ్చిన అప్లికేషన్లను మాత్రం పరిష్కరించడం లేదు. పైగా జూన్ 28 నుంచి జూలై 2 వరకు పెట్టుకున్న అప్లికేషన్లన్నీ గల్లంతయ్యాయి.

నోషనల్ ఖాతాల్లోనే రైతుల భూములు

ధరణి పోర్టల్​కు ముందు రెవెన్యూ అధికారులు పొరపాటున నోషనల్ ఖాతాల్లో పట్టా భూములను చేర్చారు. ఇరిగేషన్ కోసం తీసుకున్న వాటికి, వక్ఫ్ భూములకు, ఫారెస్ట్ భూములకు, గవర్నమెంట్ ల్యాండ్స్‌‌‌‌కు నోషనల్ ఖాతాలు ఉంటాయి. ఇలా అనేక భూములను ఇరిగేషన్ నోషనల్ ఖాతాల్లోకి ఇష్టమొచ్చినట్లు ఎంట్రీ చేశారు. కొన్ని ప్రభుత్వ భూముల్లోని నోషనల్ ఖాతాల్లోకి వెళ్లాయి. ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద, హైవేల్లో భూములు పోయిన ప్రాంతాల్లోనే ఇది జరిగింది. నిజంగానే ప్రాజెక్టులు, కాలువలు, రోడ్లలో కొంత భూమి పోయి, విస్తీర్ణం కట్ చేసే టైంలో ఎక్కువ తీసేసిన వారికి తిరిగి మళ్లీ ఇచ్చే ఆప్షన్ ఉంది. కానీ అసలు భూములు పోకుండానే పోయినట్లు ఎంట్రీ అయిన వారికి మాత్రం అప్లై చేసుకోవడానికి ధరణి పోర్టల్‌‌‌‌లో అలాంటి అవకాశం లేదు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆయా రైతులకు రైతుబంధు, బీమా, క్రాప్‌‌‌‌లోన్లు అందడం లేదు.

సమస్య తీరక.. అవసరానికి అమ్ముకోలేక

ఒక్కో సమస్యపై ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మంత్రులకు వినతులు వెళ్తున్నా.. వాటిని  ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించడం లేదు. మంత్రులు కేటీఆర్, హరీశ్​కు ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మొరపెట్టుకుంటే.. కలెక్టర్ కు ట్యాగ్ చేసి వదిలేస్తున్నారు. దీంతో భూసమస్యలు తీరక, రైతుబంధు పొందలేక, భూమిని అమ్ముకోలేక, కుటుంబ సభ్యుల పేర మార్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో ఒక బిట్ అసైన్డ్ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లో ఉన్న ఇతర పట్టాభూములు రిజిస్ర్టేషన్ అవ్వట్లేదు. కోర్టు కేసు ఒక బిట్ పైన ఉన్నా మిగతా సబ్ డివిజన్లు రిజిస్ర్టేషన్ చేసుకోలేని పరిస్థితి. ఒక సర్వే నంబర్లో ఎవరో ఒకరు నాలా కన్వర్షన్ చేసుకుంటే, ఆ సర్వే నంబర్లో మిగతావి రిజిస్ట్రేషన్ చేసుకునే చాన్స్ లేదు. పొరపాటున రిజిస్ర్టేషన్ ఆఫీస్‌‌‌‌లో సేల్ డీడ్ చేసుకున్న కొనుగోలుదారుడు చనిపోతే.. వారి వారసులకు సేల్ డీడ్ మ్యుటేషన్ ఎలా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటునోళ్లు చనిపోయినా వాటిపైనే ఆధారపడి ఉన్న  కుటుంబ సభ్యులపై ఆ భూములు ఎలా మారుస్తారనేది స్పష్టత లేదు. పట్టాదారు పేర్లు తప్పు పడి, అన్ని అర్హతలున్నా అవసరానికి సొంత పట్టా భూమిని అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడ్తున్నరు.

ఈ ఫొటోలోని వ్యక్తి చింతల శంకర్. ఈయనకు సంగారెడ్డి జిల్లా గారిదేగం గ్రామ శివారులో సర్వే నంబర్ 21లో వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల 33 గుంటల భూమి ఉంది. కానీ పాసు బుక్ ఇవ్వడం లేదు. రైతుబంధు రావడం లేదు. ఇదేంటని అడిగితే 21 సర్వే నంబర్ భూములు నల్లవాగు ప్రాజెక్టులో పొరపాటున ఎంట్రీ అయ్యాయని చెప్తున్నారు. తమ భూమికి, ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని, సాధారణ పట్టాలోకి మార్చాలని ఆయన ఇప్పటికి నాలుగు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. కాళ్లు అరిగేలా తిరుగుతున్నా సమస్య పరష్కరించడం లేదని వాపోతున్నారు. ఈ భూమి పొరపాటున ఇరిగేషన్ నోషనల్ ఖాతాలోకి వెళ్లిందని ఎమ్మార్వో దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఒప్పుకుంటున్నా.. ధరణిలో ఆప్షన్ లేక మార్చడం లేదు. ట్విట్టర్ లో కేటీఆర్​కు విన్నవించుకున్నా పని జరగలేదు. ఈయనతో పాటు ఈ ఊర్లోనే ఇంకా కొందరు రైతుల భూములు నోషనల్ ఖాతాల్లోకి వెళ్లాయి.

గిట్ల మస్త్ ఉన్నయంట..

కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం బూర్గుపల్లికి చెందిన గోతి జగదీశ్‌‌‌‌కు గ్రామ శివారులో సర్వే నంబర్ 93లో పట్టా భూమి ఉంది. ఇందులో ఓ సబ్ డివిజన్ ను అసైన్ మార్కింగ్ చేసి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంచారు. దీంతో వారసత్వ బదిలీకి, అమ్మకానికి వారి పట్టా భూములు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. గ్రీవెన్స్ అప్లికేషన్ కు నాలుగు నెలల కిందట అర్జీ పెట్టుకున్నారు. మొన్న జూన్​లోనూ వాట్సాప్, ఈమెయిల్స్ లో కంప్లయింట్ చేశారు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. స్థానిక ఎమ్మెల్యే కాడికి పోయి చెప్పుకుంటే ‘గిట్ల మస్త్ ఉన్నయి’ అని చెప్పారు.
 

చెప్పుకుంటూ పోవుడే..
ఈయన పేరు జి.హరీశ్ కుమార్. తల్లి పేరిట 30 గుంటల భూమి ఉందని.. అయితే పట్టాదారు పాస్ పుస్తకంలో పట్టాదారు పేరులో గ్రామం పేరును, తండ్రి/భర్త పేరు స్థానంలో మండలం పేరును ఎంట్రీ చేశారని ఆయన చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించాలని తిరుగుతున్నారు. ధరణి వచ్చిన కొత్తలో ఆప్షన్ ఇవ్వడంతో అప్లై చేసుకున్నారు. పరిష్కారం కాలేదు. తర్వాత సీఎస్ చెప్పారని వాట్సాప్, ఈ మెయిల్స్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. పరిస్థితి మారలేదు. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్, హరీశ్ రావుకు విన్నవిస్తే.. వాళ్లేమో కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు చెప్పారు. కలెక్టరేమో ఆప్షన్ రాలేదని, వచ్చినపుడు చేస్తామని చెప్పి చేతులుదులుపుకున్నారు. ఇప్పుడు మళ్లీ ధరణిలో దరఖాస్తు చేశారు. దానికీ ఉలుకు పలుకు లేదు. సమస్య చెప్పుకోవడమే తప్ప పరిష్కారం మాత్రం చూపెట్టడం లేదు.