టీకాలు ఉన్నా వేస్తలే

టీకాలు ఉన్నా వేస్తలే
  • 1.86 లక్షల డోసులు ఉన్నాయని సీఎంవో ప్రకటన
  • అవన్నీ ఐదు రోజులకు సరిపోయే చాన్స్‌‌‌‌
  • ఈలోపల అందుబాటులోకి మరో 4.11 లక్షలు
  • అయినా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయని రాష్ట్ర సర్కార్

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి జనం అరిగోస పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ను పడావుపెడుతోంది. హెల్త్ మినిస్ట్రీని స్వయంగా ముఖ్యమంత్రే చూస్తున్నా కరోనా ట్రీట్​మెంట్ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బంది ఈసమెత్తు కూడా తగ్గుతలేదు. వెంటిలేటర్ బెడ్లు దొరక్క ఎంతో మంది పేషెంట్ల ప్రాణాలు పోతుంటే అందుబాటులో ఉన్నవాటిని కూడా వాడుకుంటలేదు. ఫస్ట్ వేవ్ టైమ్​లో కేంద్రం ఇచ్చిన 1400 వెంటిలేటర్లలో సగానికి పైగా ఇంకా సీల్ కూడా తీయకుండా మూలకుపెట్టింది. కరోనా కట్టడికి ఉన్న ఒకే ఆయుధం వ్యాక్సినేషన్ కూడా మూడ్రోజులుగా బందువెట్టింది. తెలంగాణలో 1.86 లక్షల వ్యాక్సిన్ డోసులు ఉన్నయని ఓ వైపు సీఎంవో ప్రకటించినా సెంటర్లలో మాత్రం వ్యాక్సిన్​ వేస్తలేరు. ఇంకో దిక్కు సర్కారు రోజురోజుకు టెస్టులు తగ్గిస్తోంది. 

హైదరాబాద్, వెలుగు: ఐదు రోజులకు సరిపడా టీకా డోసులు ఉన్నా రాష్ట్ర సర్కార్ వ్యాక్సినేషన్‌‌‌‌ను బంద్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,780 వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి. ఇందులో 58,230 కొవాగ్జిన్​ డోసులు కాగా, 1,28,550 కొవిషీల్డ్ డోసులు ఉన్నాయి. ఈ విషయాన్ని సీఎం ఆఫీస్​ సోమవారం సాయంత్రం వెల్లడించింది. కేంద్రం నుంచి మొత్తం 57,30,220 డోసులు వచ్చాయని, అందులో 1.86 లక్షల డోసులు ఉన్నాయని తెలిపింది. లాక్‌‌‌‌డౌన్ మొదలైనప్పటి నుంచి రోజుకు సగటున 35 వేల మందికే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పుడున్న 1.86 లక్షలతో కనీసం ఐదు రోజుల పాటు వ్యాక్సినేషన్ నిర్వహించొచ్చు. మరోవైపు, ఇంకో 4.11 లక్షల డోసులను తెలంగాణకు కేటాయిస్తూ మూడు రోజుల కిందనే  కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్టేట్ హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు సమాచారం అందించింది. మన దగ్గర ఉన్న 1.86 లక్షల డోసులు అయిపోకముందే ఈ 4.11 లక్షల డోసులు కూడా అందుబాటులోకి వచ్చేవి. దీంతో నిరాటంకంగా వ్యాక్సినేషన్‌‌‌‌ సాగిపోయేది. కానీ,  శనివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్​ను ఆపేసింది. ఎప్పుడు స్టార్​ చేస్తారన్నదీ చెప్పడం లేదు. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. కేంద్ర సర్కార్‌‌‌‌ను బద్నాం చేయడానికే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌‌ను ఆపేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం జనాలు తండ్లాతున్నారు. వ్యాక్సిన్‌‌ డోసులు లేవని చెప్పి బంద్ పెడితే, జనాల్లో కేంద్రంపై వ్యతిరేకత పెంచొచ్చునన్న ఉద్దేశంతోనే ఇట్ల బంద్ చేశారని బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ప్రజలు కరోనాతో చస్తుంటే రాష్ట్ర సర్కార్ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేయడం ఏంటని  డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కరోనాను వ్యాక్సిన్‌‌తో నే అడ్డుకునే అవకాశం ఉండగా.. వ్యాక్సినేషన్ ఆపేయడమేందని విమర్శిస్తున్నారు. కొవిషీల్డ్‌‌ సెకండ్ డోసు వేసుకోవడానికి ఎవరూ ఎలిజిబుల్ లేకపోతే ఫస్ట్‌‌ డోసు వాళ్లకు వేయొచ్చుగా అని డాక్టర్లు అంటున్నారు.