
- రాష్ట్రంలో 62 ఆస్పత్రులకు 29 దవాఖాన్లలో నిల్
- కేంద్రమిచ్చినా ఇన్‌స్టాల్ చేయని రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్న 9 జిల్లా దవాఖాన్లలో ఒక్క వెంటిలేటర్‌కూడా లేదు. స్టేట్ హెల్త్ బులెటిన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 62 సర్కార్ దవాఖాన్లలో కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తుండగా, 29 ఆస్పత్రుల్లో అసలు వెంటిలేటర్లే లేవు. మరో 10 హాస్పిటళ్లలో ఐదు లోపే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 800 వెంటిలేటర్లే ఉన్నాయి. వీటిలో గాంధీలోనే 385 ఉండగా, ప్రస్తుతం అక్కడ 361 మంది వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, భువనగిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నర్సంపేట(వరంగల్ రూరల్), నిర్మల్ జిల్లా ఆస్పత్రుల్లో ఒక్క వెంటిలేటర్ కూడా లేదు. చాలాచోట్ల కనీసం ఐసీయూ బెడ్లు కూడా లేవు. రాష్ర్టంలో కరోనాకు ముందు 192 వెంటిలేటర్లు ఉండేవి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1,400 వెంటిలేటర్లు పంపించింది. రాష్ర్ట సర్కార్ కొన్ని బెడ్లు కొనుగోలు చేయగా, మరికొన్ని విరాళాల రూపంలో వచ్చాయి. కానీ వీటిని ఆయా దవాఖాన్లలో ఇన్‌స్టాల్ చేయడంలో మాత్రం సర్కార్ శ్రద్ధ చూపడం లేదన విమర్శలు ఉన్నాయి. జిల్లాల్లో ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేకపోవడంతో పేషెంట్లను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. దీంతో సిటీలోని దవాఖాన్లలో డాక్టర్లు, నర్సులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు పేషెంట్ల కుటుంబసభ్యులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.