Sivaji : "ఆ రెండు పదాలకు క్షమాపణలు.. నా ఉద్దేశ్యం అది కాదు!".. విమర్శలపై శివాజీ భావోద్వేగ వివరణ.

Sivaji : "ఆ రెండు పదాలకు క్షమాపణలు.. నా ఉద్దేశ్యం అది కాదు!".. విమర్శలపై శివాజీ భావోద్వేగ వివరణ.

హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సినీ ఇండస్ట్రీతో పాటు మహిళల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉమెన్ కమీషన్ కూడా సీరియస్ అయింది. దీంతో శివాజీ మీడియా ముందుకు వచ్చి తన ఉద్దేశాన్ని తెలిపారు.  30 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా తాను వివాదంలో చిక్కుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడపడుచులందరికీ క్షమాపణలు!

ప్రెస్ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ క్షమాపణలు కోరారు. ' దండోరా' మూవీ ఈవెంట్ లో  తనకు తెలియకుండా కొన్ని పదాలు దొర్లాయి. నేను వాడిన ఆ రెండు 'అన్ పార్లమెంటరీ' పదాలకు గాను తెలుగు ఆడపడుచులందరికీ, టీవీలు , సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నాను. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఇప్పటికే నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు..

నా ఆవేదనకు కారణం ఆదే..

తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో శివాజీ వివరించారు. ఇటీవల లులూ మాల్‌ లో నిధి అగర్వాల్ పబ్లిక్‌గా ఎంత ఇబ్బంది పడిందో చూశాను. సమంత విషయంలోనూ అలాంటివే జరిగాయి. ఒకవేళ అనుకోకుండా బట్టలు జారితే ఆ వీడియోలు జీవితాంతం ఇంటర్నెట్‌లో ఉండిపోతాయి. ఆ హీరోయిన్లకు ఇబ్బంది ఎదురైనప్పుడు ఏ ఒక్కరైనా స్పందించారా? వారి పట్ల ఉన్న బాధ్యతతోనే నేను మాట్లాడాను తప్ప ఎవరినీ కించపరచాలని కాదు అని స్పష్టం చేశారు.

ALSO READ : నాని సరసన సెన్సేషన్ బ్యూటీ.. ‘ది ప్యారడైస్’ హీరోయిన్ ఫిక్స్..

డ్రెస్ కోడ్ 

రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని శివాజీ గుర్తు చేశారు. ప్రతి చోటా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. పబ్బులకు వెళ్లేటప్పుడు కూడా నియమాలు ఉంటాయి. ప్రవోకింగ్ (రెచ్చగొట్టడం) అనేది కూడా ఒక రకమైన నేరమే. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే నాకేంటి? కానీ బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నదే నా ఆవేదన. నా వ్యాఖ్యల్లోని ఆ రెండు పదాలను పక్కన పెడితే, మిగిలిన నా స్టేట్‌మెంట్‌కు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అని ఆయన స్పష్టం చేశారు.

అనసూయకు సూటి ప్రశ్న..

ఈ వివాదంలోకి వచ్చిన నటి అనసూయను ఉద్దేశించి శివాజీ ఘాటుగా స్పందించారు. అనసూయ గారు.. మీరు ఇందులో ఎందుకు ప్రవేశించారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వారికి నా వందనాలు. గతంలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

రెండు రోజులుగా నిద్ర లేక, తీవ్ర మథనానికి గురయ్యానని శివాజీ తెలిపారు. త్వరలోనే ఉమెన్ కమిషన్‌ను కూడా కలిసి తన వివరణ ఇస్తానని చెప్పారు. అమరావతి ఆడబిడ్డల కోసం నిలబడిన చరిత్ర తనదని, స్త్రీ అభ్యున్నతిని తాను ఎప్పుడూ గౌరవిస్తానని శివాజీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.