మతం ఆధారంగా ఓటర్ల డేటా ఉండదు.. సీఎం యోగి వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్ 

మతం ఆధారంగా ఓటర్ల డేటా ఉండదు.. సీఎం యోగి వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్ 

లక్నో: రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో 1.27 కోట్ల మంది హిందూ ఓటర్లు గల్లంతయ్యారంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నవదీప్ రిన్వా స్పందించారు. ఎన్నికల సంఘం మతం ఆధారంగా ఓటర్ల డేటాను సేకరించదని స్పష్టం చేశారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) కింద ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఓటర్ల జాబితాల్లో ఓటరు పేరు, బంధుత్వం, వయసు వంటి వివరాలే ఉంటాయని, మతం ఆధారంగా ఎలాంటి డేటా ఇవ్వబోమని చెప్పారు. పీడీఎఫ్ ఫైళ్లను డేటాబేస్‌‌‌‌‌‌‌‌గా మార్చి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దొరికే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్లతో మతాల వారీగా విభజించడం సాంకేతికంగా సాధ్యమేనని, కానీ అలాంటి కసరత్తులతో ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

యోగి ఏమన్నారంటే..

రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు 1.63 శాతం పెరగగా, హిందూ ఓటర్లు 1.27 కోట్లు తగ్గారని యోగి ఇటీవల ఆరోపించారు. ఇందులో 66 లక్షల మంది పంచాయతీ ఓటర్ల జాబితాలో ఉన్నా అసెంబ్లీ జాబితాలో లేరని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 55 లక్షల మంది హిందువులు కూడా జాబితాలో లేరని చెప్పారు. 
ఎన్నికల సంఘం మతాల వారీగా ఓటర్ల డేటా ఇవ్వనప్పుడు ఈ లెక్కలు ఎక్కడివని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. తమ పరిశోధన బృందం మతాల వారీ మ్యాపింగ్ చేసిందని, డేటా తప్పు కాదని, కానీ ఎలా సేకరించారో అధికారికంగా వెల్లడించలేమని సీఎం కార్యాలయ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు.  
18.84 లక్షల కొత్త ఓటర్లు

ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రచురించిన జాబితాలో రాష్ట్రంలో 13,39,84,792 మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 17 నాటికి ఆ సంఖ్య 13,58,68,905కు చేరిందని, అంటే 18.84 లక్షల మంది పెరిగారని రిన్వా తెలిపారు. కొత్త ఓటర్లలో 10.96 లక్షల మంది మహిళలు, 7.87 లక్షల మంది పురుషులు ఉన్నారని, 18–19 ఏండ్ల వయసు వారు 11.83 లక్షల మంది చేరారని చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్లు దాదాపు 7.38 కోట్లు, మహిళా ఓటర్లు 6.20 కోట్లు ఉన్నారు. 

జనాభా అంచనాల ప్రకారం రిజిస్టర్ అయిన ఓటర్లు దాదాపు 2 కోట్లు తక్కువగా ఉన్నారని రిన్వా తెలిపారు. ముసాయిదా జాబితాపై ఈ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకు ఫామ్ 6, 7, 8 ద్వారా పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చని, 21, 22, 28, 29 తేదీల్లో పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు ఉంటాయని చెప్పారు. తుది ఓటర్ల జాబితా 2027 జనవరి 4న విడుదలవుతుంది.