ఎక్కడా నీళ్లులేవ్!.అడుగంటిన ప్రాజెక్టులు,రిజర్వాయర్లు

ఎక్కడా నీళ్లులేవ్!.అడుగంటిన ప్రాజెక్టులు,రిజర్వాయర్లు
  • అడుగంటిన ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు
  • గోదావరి, కృష్ణా బేసిన్ జలాశయాల్లో  572 టీఎంసీల కొరత
  • రాష్ట్రంలో సగానికి సగం పొలాల్లో పడని వరి నాట్లు
  • కోటి 8 లక్షల ఎకరాలకు 42లక్షల 75వేల ఎకరాల్లోనే పంటలు

హైదరాబాద్‌, వెలుగు:రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ డెడ్​స్టోరేజీకి చేరుకున్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఇప్పుడిప్పుడే వరదలు మొదలైనా గోదావరి నదికి మాత్రం ఎలాంటి ప్రవాహం లేదు. రాష్ట్రంలో ఈ రెండు నదులపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 572 టీఎంసీల నీటి కొరత నెలకొంది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌, జూరాల ప్రాజెక్టులతోపాటు గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీ, నిజాంసాగర్‌, సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు  కళతప్పిపోయాయి. వానాకాలం మొదలై 40 రోజులు గడుస్తున్నా చినుకు జాడ లేదు. ఫలితంగా సాగు పనులు ముందుకు సాగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జూన్​లో తీవ్ర లోటు వర్షపాతం నమోదవగా.. ఈ నెలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

గోదావరి ప్రాజెక్టుల్లో ఇలా,,

గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉంది. అన్ని జలాశయాల్లో నీటి మట్టాలు దాదాపు డెడ్‌లెవల్‌ దిగువకు పడిపోయాయి. ఈ బేసిన్​లోని ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 215.74 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే 195.30 టీఎంసీల నీటి కొరత ఉంది. ఎగువ గోదావరిలో చుక్క నీరు కూడా ప్రవహించడం లేదు. ఉప నదుల్లో ఒక్క ప్రాణహితలోనే ప్రవాహం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా, నాసిక్‌ ప్రాంతంలో  (మొదటి పేజీ తరువాయి)

నెలకొన్న దుర్భిక్షంతో గోదావరి వట్టిపోయింది. మహారాష్ట్రలోని గైక్వాడ్‌‌ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలకు గాను 18.65 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టులో 40.93 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మన రాష్ట్రంలోని సింగూరులో 29.91 టీఎంసీలకు 0.38 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టులో 7.99 టీఎంసీలు ఉన్నాయి. నిజాంసాగర్‌‌లో17.80 టీఎంసీలకు 0.07 టీఎంసీలే ఉన్నాయి. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టులో 2.39 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ వర ప్రదాయినిగా పిలువబడే శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు దాదాపు ఎండిపోయింది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 90.31 టీఎంసీలకు 5.41 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజున జలాశయంలో 12.12 టీఎంసీలు ఉన్నాయి. మిడ్‌‌ మానేరులో 25.87 టీఎంసీలకు 3.38 టీఎంసీలు, లోయర్‌‌ మానేరు డ్యాంలో 24.07 టీఎంసీలకు 3.47 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. కడెం ప్రాజెక్టులో 7.60 టీఎంసీలకు 2.83 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకు 4.90 టీఎంసీలున్నాయి. ఈ యేడాది గోదావరి పరీవాహక ప్రాంతంలో ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. క్యాచ్‌‌మెంట్‌‌ ఏరియాలోని ఒక్క వాగు కూడా పొంగలేదు.

కృష్ణా ప్రాజెక్టుల్లోనూ అంతంతే!

కృష్ణా బేసిన్​లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇక్కడి ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం 537.52 టీఎంసీలకు గాను ప్రస్తుతం 160.82 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అంటే.. 376.70 టీఎంసీల నీటి కొరత ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా బుధవారానికి 31.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున 29.06 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. నాగార్జునసాగర్‌‌ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను బుధవారానికి ప్రాజెక్టులో 126.97 టీఎంసీల నీళ్లున్నాయి. గతేడాది ఇదే రోజు వరకు 133.37 టీఎంసీల నీళ్లు జలాశయంలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కృష్ణా నదిలో ప్రవాహం చాలా తక్కువగా ఉంది. జూరాల నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను 1.95 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు జలాశయంలో 5.73 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎగువ ప్రవాహం మొదలైనా కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌‌, ఉజ్జయిని, తుంగభద్ర నిండి దిగువకు నీళ్లు రావడానికి మరో నెల రోజులకు పైగానే సమయం పట్టే అవకాశముంది. ఈ నాలుగు ప్రాజెక్టుల సామర్థ్యం 385.46 టీఎంసీలు కాగా 116.61 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. కర్నాటక ప్రాజెక్టులకు ఇంకా 268.85 టీఎంసీల కొరత ఉంది. వర్షాకాలం నాటికి ఆల్మట్టిలో 21.65 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఈ సీజన్‌‌లో 33.11 టీఎంసీల నీళ్లు జలాశయంలో చేరాయి. నారాయణపూర్‌‌లోకి 2.92 టీఎంసీలు, ఉజ్జయినిలోని 7.73 టీఎంసీలు, తుంగభద్రలోకి 2.40 టీఎంసీల నీళ్లు చేరాయి.

కాళేశ్వరం ఈ ఏడాది కష్టమే?

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రాణహితలో 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఆ నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పంపుహౌస్‌‌లో మూడు మోటార్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. ఆ నీటిని ఆగస్టు 15 నాటికి మిడ్‌‌ మానేరుకు తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ యేడాది పూర్తిస్థాయి ఎత్తిపోతలు సాధ్యమయ్యే పనికాదని, ఈ నీళ్లపై ఆధారపడవద్దని కొందరు ఇంజనీర్లు అంటున్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తే నీటిని ఎల్‌‌ఎండీ దిగువ ఆయకట్టుకు ఇవ్వడం కొంతమేరకు సాధ్యమవుతుందని అంటున్నారు. ఎగువ గోదావరిలో ప్రవాహం వస్తేనే నిజామాబాద్‌‌, కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌, వరంగల్‌‌, మెదక్‌‌ పాత జిల్లాలకు సాగునీరు ఇవ్వడానికి వీలుపడుతుందని వారు పేర్కొంటున్నారు. అన్ని పంపుహౌసుల్లో మోటార్లు పూర్తి స్థాయిలో పనిచేసి ఆశించిన స్థాయిలో నీటిని ఎత్తిపోయగలిగితే ఎస్సారెస్పీకి రివర్స్‌‌ పంపింగ్‌‌ చేయగలమని చెప్తున్నారు