అడ్వకేట్తో పాటు రెండు సంస్థలకు నోబెల్ పీస్ అవార్డ్

అడ్వకేట్తో పాటు రెండు సంస్థలకు నోబెల్ పీస్ అవార్డ్

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు కలిపి ఇచ్చారు. బెలారస్ కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బైల్యాట్‌స్కీతో పాటు రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు ఈ సారి ప్రైజ్ దక్కింది. మానవ హక్కుల కోసం వారు చేస్తున్న విశేష కృషికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వాల అరాచకాలను ప్రశ్నించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడం కోసం పాటుపడ్డారని పేర్కొంది.

నోబెల్ శాంతి బహుమతి కోసం 343 మంది పోటీ పడగా.. మానవ హక్కుల సంఘాలకు ఈ సారి అవార్డు లభించింది. 1980లలో బెలారస్లో  ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో అలెస్‌ ఒకరు.  అయితే అలెస్‌ బైల్యాట్‌స్కీని 2020లో విచారణ లేకుండానే అక్కడి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.

రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్ ఈ ఏడాది ప్రారంభంలో మూతపడింది. గత 30 ఏళ్లుగా మెమోరియల్ సంస్థ సోవియెట్ పాలనలో శిక్షించిన, బంధించిన, పీడించిన కొన్ని లక్షల మంది ప్రజల జ్ఞాపకశక్తిని పునరుద్ధరించేందుకు కృషి చేసింది. సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్.. మానవహక్కులు, ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడింది. ఉక్రెయిన్ పౌరసమాజాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేసింది. అధికారులపై నిరంతరం ఒత్తిడి చేసింది. రష్యా యుద్ధనేరాలను గుర్తించి డాక్యుమెంట్ చేసే ప్రయత్నం చేసింది.