ఒక్కరూ రాలే.. సార్లు, పిల్లలే ఊడ్సుకున్నరు

ఒక్కరూ రాలే.. సార్లు, పిల్లలే ఊడ్సుకున్నరు
  • పేరెంట్స్ నుంచి పర్మిషన్ లెటర్ తేని పిల్లల్ని వెనక్కి పంపిన టీచర్లు
  • పలు జిల్లాల్లో 40 శాతంలోపే హాజరు

నెట్​వర్క్, వెలుగు: కరోనా లాక్​డౌన్ తో మార్చి16న రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డ స్కూల్స్, కాలేజీలన్నీ పదిన్నర నెలల లాంగ్​గ్యాప్​తర్వాత సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్​రూల్స్​పాటిస్తూ స్టూడెంట్స్​ తొలిరోజు క్లాసులకు అటెండ్​అయ్యారు. ఇంకా కరోనా భయం పోకపోవడంతో ఫస్ట్ డే​స్టూడెంట్స్​ను పంపేందుకు చాలామంది పేరెంట్స్​ఇంట్రెస్ట్​ చూపలేదు. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కడా 50 పర్సెంట్​అటెండెంట్స్​దాటలేదు.  పేరెంట్స్ నుంచి పర్మిషన్ లెటర్ తేని పిల్లల్ని టీచర్లు వెనక్కి పంపారు.స్వీపర్స్, స్కావెంజర్స్​లేకపోవడంతో సర్కారు బళ్లలో టీచర్లు, స్టూడెంట్లే స్కూళ్లను ఊడుస్తూ, తుడుస్తూ, కడుగుతూ కనిపించారు.

పంచాయతీ, మున్సిపల్​ సిబ్బంది రాలే..

స్టేట్​వైడ్​గా 16,624 సర్కారు హైస్కూళ్లలో 12,76,683 మంది స్టూడెంట్లు ఉండగా 6,15,047(48%) మంది, 6,373 ప్రైవేట్​ స్కూళ్లలో 3,99,764 మంది స్టూడెంట్లకు 2,19,929(55%) మంది హాజరయ్యారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాల్లో 67,089 స్టూడెంట్లకు 14,300(21.3%) మంది హాజరయ్యారు. కరోనా ఎఫెక్ట్​తో ప్రైమరీ, ప్రీప్రైమరీ స్కూల్స్ ఓపెన్​ చేయలేదు.​  కేవలం హైస్కూళ్లలో అదీ నైన్త్​, టెన్త్​ స్టూడెంట్స్​కు మాత్రమే పర్మిషన్​ ఇచ్చారు. ఇంటర్​ సర్కారు కాలేజీల్లో ఓవరాల్​గా 33శాతం స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. మొత్తం 404 గవర్నమెంట్ కాలేజీల్లో 85,255 మంది స్టూడెంట్స్​కు గానూ 27,963 మంది హాజరయ్యారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 61శాతం మంది స్టూడెంట్స్​ రాగా, అత్యల్పంగా మంచిర్యాలలో 20శాతం మంది అటెండ్ అయ్యారు. స్టేట్​వైడ్ గా 25 వేలకు పైగా ఉన్న సర్కారు ప్రైమరీ, హైస్కూళ్లలో గతేడాది వరకు సుమారు 28వేల మంది సర్వీస్​ పర్సన్స్​ పనిచేశారు. వీరు నిత్యం బడులను ఊడ్వడం, బెంచీలు తూడ్వడం, టాయ్​లెట్లు క్లీన్ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం చేసేవారు. ఈ పనులన్నీ పంచాయతీరాజ్, మున్సిపల్​​డిపార్ట్​మెంట్లకు అప్పగించిన ప్రభుత్వం సర్వీస్​పర్సన్స్​ను రెన్యువల్​ చేయలేదు. శానిటేషన్​ సిబ్బంది రాకపోవడంతో తొలిరోజు టీచర్లు, స్టూడెంట్లు కలిసి అన్ని  పనులు చేశారు.

ఒక్కరూ రాలే!

వరంగల్ ​రూరల్​ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి స్కూల్​కు ఫస్ట్​రోజు ఒక్క స్టూడెంట్​కూడా హాజరు కాలేదు. డీఈవో వాసంతి స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ టైంలో ఒక్కరూ కూడా లేరు. మొత్తం ఎంతమంది ఉన్నారని ప్రశ్నించగా ముగ్గురు స్టూడెంట్లు ఉన్నట్లు టీచర్లు చెప్పారు. స్టూడెంట్లు వచ్చేవరకు తాను అక్కడే ఉంటానని డీఈవో చెప్పడంతో హెచ్ఎం స్టూడెంట్ల ఇంటికి వెళ్లి ముగ్గురిలో ఒకరిని తీసుకువచ్చారు.

ఆర్జేడీలకు పర్యవేక్షణ బాధ్యతలు

స్కూళ్లలో కోవిడ్ గైడ్ లైన్స్​పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు గానూ ఆర్జేడీలకు బాధ్యతలు అప్పగిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు సోమిరెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు శ్రీనివాసచారి, ఉమ్మడి మెదక్ కు సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి నిజామాబాద్​కు విజయలక్ష్మిబాయి, కరీంనగర్​కు రాజీవ్, వరంగల్​కు లింగయ్య, ఉమ్మడి నల్లగొండకు జి.రమేష్, రంగారెడ్డి జిల్లాకు డీడీ  వెంకటనర్సమ్మ కేటాయించారు.

స్కూల్​ను క్లీన్‌ చేసిన హెచ్‌ఎం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి హైస్కూల్ లో పనిచేస్తున్న అటెండర్ అనారోగ్యంతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. దీంతో హెచ్ఎం అన్నామణి, టీచర్లు కలిసి తరగతి గదులు, వరండాను శుభ్రం చేశారు. టెన్త్​క్లాసులో 73 మంది స్టూడెంట్లకు 13 మంది, నైన్త్​క్లాసులో 67 మందికి ఆరుగురు మాత్రమే హాజరయ్యారు.

తప్పని క్లీనింగ్​ పని

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల స్కూల్ లో అపరిశుభ్రంగా ఉన్న క్లాస్ రూమ్, బెంచీలను స్టూడెంట్లు స్వయంగా శుభ్రం చేసుకున్నారు.

వరంగల్​అర్బన్​జిల్లా కమలాపూర్​గర్ల్స్​హైస్కూల్​లో అటెండర్లు లేక హెడ్​మాస్టర్, టీచర్​పనులు చేయాల్సి వచ్చింది. క్లాసుల్లో అవసరమైన బెంచీలు మోస్తూ కనిపించారు. కొన్నిచోట్ల టాయిలెట్లు గదులు కూడా శుభ్రం చేశారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో తొలిరోజు కొన్ని స్కూళ్లలో పంచాయతీ, మున్సిపల్​ సిబ్బంది సహకారంతో క్లాస్​రూమ్స్, బెంచీలు క్లీన్ చేయించారు. ఎవరూ రానిచోట టీచర్లు శుభ్రం చేశారు. అటెండర్, వాచ్​మెన్, స్వీపర్,అటెండర్లను తొలగించడంతో టీచర్లే గంట కొట్టాల్సి వచ్చింది. స్టూడెంట్సే వాటర్​ ట్యాంకులు క్లీన్​ చేసుకున్నారు. ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. లెక్చరర్లు పనులు చేయాల్సి వచ్చింది.

ములుగు జిల్లాలోని వెంకటాపురం జడ్పీ హై స్కూల్​లో టీచర్లే స్కావెంజర్లు అయ్యారు. టీచర్లు సుజాత, కవిత, పుష్పాలత, మౌలాలి, ఝాన్సీ తదితరులు గదుల్లో పైపులతో నీళ్లు పట్టి చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు.

బెంచీకొకరు కూర్చున్నం
ఇన్ని రోజులు ఆన్ లైన్ క్లాసులు విన్నాం . కొన్ని పాఠాలు అర్థం కాలేదు. బడులు తెరిచేసరికి ఆనందంగా ఉంది. బెంచీకి ఒక్కరిని కూర్చోబెడుతున్నారు . ఇంటి దగ్గరి నుంచే హ్యాండ్ వాష్ బాటిళ్లు తీసుకెళ్తున్నం. టీచర్లు కూడా క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలో చెబుతున్నారు. – గడ్డి విమల, టెన్త్ క్లాస్, చింతకుంట, కరీంనగర్.

ఇవి కూడా చదవండి

15 వేల స్కూళ్లకు బూస్టింగ్

స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్..తొలిరోజు అటెండెన్స్ 55%

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల