
- బీజేపీలో చివరి క్షణం వరకు ఉత్కంఠ
- ఆగమేఘాల మీద ఆ పార్టీ బీఫారాలు
- నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు
- టికెట్ రద్దుతో బీఎస్పీలో చేరిన నీలం మధు
- పటాన్ చెరులో కాంగ్రెస్ వర్సెస్ బీఎస్పీ
- వేములవాడలో తుల ఉమను తప్పించి వికాస్ రావుకు బీఫాం ఇచ్చిన బీజేపీ
- ఆర్వో ఆఫీసు వద్దే కన్నీరు పెట్టిన తుల ఉమ
- ఇవాళ వెయ్యి నుంచి 1500 దాఖలు?
- 13న స్క్రూట్నీ.. 15న ఉపసంహరణలు
- ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు, ముగ్గురి నామినేషన్
- పలు చోట్ల రెండేసి సెట్లు అందజేసిన అభ్యర్థులు
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. తుది రోజు వెయ్యికిపైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు 2,474 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తుది రోజు రిటర్నింగ్ అధికారి ఆఫీసుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థిని మార్చి శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో నీలం మధు ఉదయం ఫార్వార్డ్ బ్లాక్ లో చేరారు. మధ్యాహ్నం బీఎస్పీలో కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎదురు పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ చివరి క్షణం వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉంది.. ప్రకటించిన స్థానాల్లో క్యాండిడేట్లను మార్చడం గమనార్హం. వేముల వాడ టికెట్ ను తొలుత తుల ఉమకు ప్రకటించిన బీజేపీ... ఆమె నామినేషన్ కు సిద్ధమై రిటర్నింగ్ అధికారి ఆఫీసు వద్దకు రాగానే అభ్యర్థిని మార్చేసింది. ఆమె స్థానంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆయన బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
సూర్యాపేట నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్ రెడ్డి చివరకు తనకు కాకుండా దామోదర్ రెడ్డికి కేటాయించడంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. కామారెడ్డి లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. నిన్నటి వరకు 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. ఇవాళ ఒక్కరోజే వెయ్యి నుంచి 1500 వరకు నామినేషన్లు వస్తాయని ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం గమనార్హం. తాము సమర్పించిన అఫిడవిట్లలో ఏమైనా తేడాలుంటే ఇబ్బంది కలుగొద్దనే ఉద్దేశంతోనే ఇలా చేశారని తెలుస్తోంది. ప్రతి అభ్యర్థి రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.