ఇయ్యాల్టి నుంచి నామినేషన్లు..ఏప్రిల్ 25 వరకు అవకాశం

ఇయ్యాల్టి నుంచి నామినేషన్లు..ఏప్రిల్ 25 వరకు అవకాశం
  • రాష్ట్రంలో జోరందుకోనున్న లోక్​సభ ఎన్నికల ప్రచారం
  • భారీ ర్యాలీలు, కార్నర్​మీటింగ్స్​కు కాంగ్రెస్​ ప్లాన్​
  • ఇతర రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను రప్పించనున్న బీజేపీ
  • బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ల పర్వం షురూ కానుంది. నాలుగో విడతలో భాగంగా తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వీటిని దాఖలు చేసేందుకు ఏప్రిల్ 25ను తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

వచ్చే నెల 13న పోలింగ్ జరుగనుంది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. రాష్ట్రంలో నామినేషన్ల నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వారం పాటు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులతో పాటు పార్టీల అగ్రనేతలు ర్యాలీల్లో పాల్గొని తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్​ దీపాదాస్ మున్షీ అటెండ్ కానున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు అటెండ్ కానున్నారు. బీఆర్​ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ చీఫ్​ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్​రావు హాజరవుతారని పార్టీ నేతలు చెప్తున్నారు. 

పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసే సందర్భంలో భారీ ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్​లు నిర్వహించేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతున్నది. కొందరు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరుకానున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఇన్​చార్జ్​ మంత్రులు, ఆయా లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకావాలని పీసీసీ నాయకత్వం ఆదేశించింది. ఈ నెల 19 నుంచి 22 మధ్యనే మంచి ముహూర్తాలు ఉండడంతో చాలా మంది ఈ మూడు రోజుల్లోనే తమ నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి.

ఈ నెల 19న, ఈ నెల 21న రెండు రోజుల పాటు రేవంత్ మహబూబాబాద్, భువనగిరిలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో మిగితా రోజుల్లో సీఎం రేవంత్​ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే, నామినేషన్ల దాఖలు ప్రోగ్రామ్​లో పాల్గొననున్న సీఎం,  దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్  రెడీ అవుతున్నది. సీఎం వస్తే ఇటు అభ్యర్థులకు మోరల్ గా సపోర్టు ఉండడంతో పాటు అటు పార్టీ ప్రచారం ఊపందుకుంటుందని నేతలు అంటున్నారు. 

బీజేపీ నామినేషన్లకు ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు

రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను చీఫ్ గెస్టులుగా రప్పిస్తున్నది. అభ్యర్థుల పేర్లు, సెంటిమెంట్లకు తగ్గట్టుగా నామినేషన్లు దాఖలు చేసే తేదీలను నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. నామినేషన్ల తొలి రోజు గురువారం మెదక్  అభ్యర్థిగా రఘునందన్ రావు  నామినేషన్​ వేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతున్నారు. గురువారమే మల్కాజ్ గిరి -స్థానానికి  ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనుండగా.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హాజరుకానున్నారు. అదే రోజు మహబూబ్ నగర్ అభ్యర్థిగా -డీకే అరుణ నామినేషన్ వేయనుండగా..  పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్​ అటెండ్​ కానున్నారు.

ఈ నెల 19న సికింద్రాబాద్ - నుంచి కిషన్ రెడ్డి నామినేషన్​ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్  హాజరవుతారు. ఈ నెల 22న జహీరాబాద్ నుంచి -బీబీ పాటిల్ నామినేషన్​ వేయనుండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అటెండ్​కానున్నారు. అదేరోజు చేవెళ్ల నుంచి- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ నుంచి- సైదిరెడ్డి నామినేషన్​ వేస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతారు. 22నే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ నామినేషన్ వేయనుండగా.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అటెండ్​ అవుతారు.

ఈ నెల 23న పెద్దపల్లి  స్థానానికి గోమాస శ్రీనివాస్ నామినేషన్​ వేయనుండగా.. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరుకానున్నారు. 24న ఆదిలాబాద్ - స్థానానికి గోడెం నగేశ్  నామినేషన్​ దాఖలు చేయనుండగా.. ప్రోగ్రామ్​లో  చత్తీస్‌‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్  పాల్గొంటారు. అదేరోజు హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలత నామినేషన్​ వేయనుండగా.. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ అటెండ్​ కానున్నారు. ఆ రోజే వరంగల్ స్థానం నుంచి ఆరూరి రమేశ్​ నామినేషన్​ దాఖలు చేయనుండగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరుకానున్నారు.

ఈ నెల 25న  కరీంనగర్ -స్థానానికి బండి సంజయ్ నామినేషన్​ వేయనుండగా.. ముఖ్య అతిథులుగా గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.  ఇదే రోజు నిజామాబాద్ - స్థానానికి ధర్మపురి అర్వింద్, నాగర్​కర్నూల్​ స్థానానికి భరత్ ​నామినేషన్​ దాఖలు చేయనున్నారు.  అర్వింద్​ ప్రోగ్రామ్​కు  కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, భరత్​ కార్యక్రమానికి గుజరాత్​ సీఎం హాజరవుతారు. 23న భువనగిరి స్థానం నుంచి బూర నర్సయ్య గౌడ్​ నామినేషన్​ వేయనున్నారు.  

ఇయ్యాల బీఫామ్స్​ ఇవ్వనున్న కేసీఆర్​

బీఆర్​ఎస్  అభ్యర్థుల నామినేషన్లకు కేసీఆర్ అటెండ్ కానున్నట్లు తెలుస్తున్నది. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు కూడా తమ నామినేషన్ల కార్యక్రమానికి రావాలని పలువురు బీఆర్​ఎస్ అభ్యర్థులు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రాథమికంగా రూట్‌‌మ్యాప్‌‌ కూడా రెడీ చేశారు.

రూట్‌‌మ్యాప్​పై గురువారం కేసీఆర్ చర్చించనున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్‌‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ ​పర్సన్లతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్స్ అందజేయనున్నారు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును ఆయన అందజేయనున్నారు. కరీంనగర్, మెదక్  ఎంపీ సీట్లపై కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నందున.. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రాంతాల మీదుగా ఆయన యాత్ర జరిగేలా రూట్‌‌మ్యాప్‌‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని చేవెళ్ల, మల్కాజ్‌‌గిరి, సికింద్రాబాద్‌‌ ఎంపీ నియోజకవర్గాల్లోనూ గెలుపుపై పార్టీ ఆశలు పెట్టుకుంది. చివరి దశ బస్సు యాత్ర ఈ మూడు నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెప్తున్నారు.