ఊర్ల లేనోళ్ల సంగతేంది?..యజమాని లైవ్‌ ఫొటోతో కొత్త చిక్కులు

ఊర్ల లేనోళ్ల  సంగతేంది?..యజమాని లైవ్‌ ఫొటోతో కొత్త చిక్కులు
  • వాళ్ల ఆస్తుల సర్వే ఎట్ల.. లైవ్‌ ఫొటోతో కొత్త చిక్కులు
  • 3 లక్షల మందికిపైగా గల్ఫ్‌ దేశాల్లోనే ఉంటున్నరు
  • వాళ్లంతా ఇప్పటికిప్పుడు సొంతూర్లకు వచ్చుడు సాధ్యమేనా?
  • సర్కారు తీరుపై ప్రజల్లో ఆగ్రహం.. భూములు గుంజుకుంటుందేమోనని భయం
  • పనిచేయని ఎన్‌పీబీ మొబైల్‌ అప్లికేషన్‌.. ఆస్తుల నమోదులో తీవ్ర సమస్యలు
  • వివరాల నమోదుకు ఇంకో ఏడు రోజులే గడువు
  • ఇతర రాష్ట్రాల్లోనే 15 లక్షల మందికిపైగా..

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా చేస్తున్న వ్యవసాయేతర ఆస్తుల సర్వే.. ఉపాధి కోసం వలస పోయినోళ్లను కలవరపెడుతున్నది. ఆస్తితో పాటు యజమాని లైవ్‌ ఫొటో తప్పనిసరి అంటూ రూల్​ పెట్టడం సమస్యగా మారింది. ఇతర దేశాలు, వేరే ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లినవాళ్లు ఇప్పటికిప్పుడు తిరిగి సొంతూళ్లకు రావడం అంత ఈజీ కాదు. ముందే కరోనా ఎఫెక్ట్​తో ఇబ్బందులు పడుతున్నామని,  ఇలాంటి టైంలో సర్వే అంటూ ప్రభుత్వం మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీలోగానే సర్వే పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ పెట్టడం, ఆస్తిని నమోదు చేసుకోకుంటే ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటుందని కొందరు మంత్రులే ప్రకటనలు చేయడం వారిని భయపడెతున్నది. సొంతూళ్ల నుంచి గల్ఫ్​సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవాళ్లు సుమారు 20 లక్షల మందికిపైగా ఉంటారు.

ఇల్లు/స్థలం ముందు నిల్చోబెట్టి ఫొటో

రాష్ట్రంలోని వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌ ఇస్తామని ప్రకటించిన సర్కారు.. ఇందుకోసం ఈ నెల 10లోగా సర్వే, 15 లోగా అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 12,761 గ్రామ పంచాయతీలు, 13 కార్పొరేషన్‌లు, 129 మున్సిపాలిటీల్లో వ్యవసాయేతర ఆస్తుల సర్వేను ప్రారంభించింది. టీఎస్‌ ఎన్‌పీబీ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఆస్తుల సర్వే చేస్తున్నది.  ఒక్కో ఆస్తిని సర్వే చేసేప్పుడు 27 రకాల వివరాలు ఎన్‌పీబీ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.సంబంధిత ఆస్తి (ఇల్లు/స్థలం) యజమానిని ఆ ఆస్తి ముందు నిల్చోబెట్టి  లైవ్​ ఫొటో తీసి దానిని అప్‌‌లోడ్‌‌ చేయాలి. ప్రతి ఆస్తికి పన్ను అసెస్‌‌మెంట్‌‌ నంబర్‌‌, ఇంటి నంబర్‌‌, యజమాని ఆధార్‌‌, మొబైల్‌‌ నంబర్, సర్వే నంబర్‌‌, ఆస్తి రకం, స్థలం.. భవనం విస్తీర్ణం, ఉమ్మడి ఆస్తయితే.. ఉమ్మడి ఆస్తి యజమాని పేరు, రేషన్‌‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌‌ కార్డ్‌‌, జన్‌‌ధన్‌‌ అకౌంట్‌‌, ఆస్తిని అసెస్‌‌ చేసిన సంవత్సరం, ఎలక్షన్‌‌ వార్డు నంబర్‌‌, కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.

పొద్దుగల్ల 6.30 గంటల నుంచే స్టార్ట్​

ప్రతి ఊరిలో ఉదయం 6.30 గంటల నుంచే ఆస్తుల సర్వే మొదలు పెట్టాలని పంచాయతీరాజ్‌‌ శాఖ కమిషనర్‌‌ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో పంచాయతీ సెక్రటరీ రోజుకు 70 ఆస్తుల వివరాలను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయాలని టార్గెట్‌‌ పెట్టారు. ఇ – పంచాయతీ రికార్డుల్లో నమోదైన ఆస్తుల డేటాను మాత్రమే మొదట మొబైల్‌‌ అప్లికేషన్‌‌లో నమోదు చేయాలన్నారు. ఇంటి యజమాని చనిపోతే ఆ ఇల్లు/ఆస్తిని ఆన్‌‌లైన్‌‌ చేయాల్సిన అవసరం లేదని, మ్యుటేషన్‌‌ పూర్తయి, యజమాని పేరు మారిన తర్వాతే ఆ ఇంటిని ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయాలని సూచించారు. ఏ ప్రాంతంలో సర్వే చేస్తున్నారో ముందు రోజే చాటింపు వేయించి ప్రజలకు తెలియజేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి మొబైల్‌‌ నుంచి మాత్రమే ఫొటో తీయాలని, ఆన్‌‌లైన్‌‌ అప్‌‌లోడ్‌‌ కూడా అదే నంబర్‌‌ నుంచి చేయాలని చెప్పారు. యాప్‌‌లో ఎడిట్‌‌ ఆప్షన్‌‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరని, అన్ని వివరాలు నమోదు చేసే ముందే ఒకటికి రెండు సార్లు క్రాస్‌‌ చెక్‌‌ చేసుకోవాలన్నారు. ఏవైనా తప్పులు దొర్లితే అందుకు కార్యదర్శిదే బాధ్యత అని హెచ్చరించారు. పదేండ్లలోపు పిల్లల ఆధార్‌‌ నంబర్‌‌ అవసరం లేదని, ప్రభుత్వ స్థలాల్లో ఏవైనా నిర్మాణాలుంటే వాటిని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. పట్టణాల్లోనూ ఉదయం నుంచే సర్వే చేయాలని ఇదివరకే ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఉన్న సిబ్బంది అందరినీ సర్వే కోసమే ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టణాల్లోని ఆస్తులను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయడానికి సీడీఎంఏ, జీహెచ్‌‌ఎంసీ వెబ్‌‌సైట్ల ద్వారా కూడా అవకాశం కల్పించారు.

3 లక్షల మందికిపైగా గల్ఫ్‌‌ దేశాల్లోనే

ఉమ్మడి కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, వరంగల్‌‌ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి 3 లక్షల మందికి పైగా గల్ఫ్‌‌ దేశాల్లో చిన్నాచితక పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీళ్లందరికీ వాళ్ల సొంతూళ్లలో పాత ఇండ్లు ఉన్నాయి. కొందరు గల్ఫ్​లో సంపాదించిన సొమ్ముతో ఖాళీ స్థలాలు కొనుగోలు చేశారు. ఈ ఆస్తుల యాజమానులుగా ఉన్న వాళ్లు గల్ఫ్‌‌లో ఉండటంతో ఇప్పుడు వాటిని ఎలా ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయించుకోవాలో తెలియక హైరానా పడుతున్నారు. ధరణిలో నమోదు కాని ఆస్తులను ప్రభుత్వం తీసుకుంటుందని ఏకంగా మంత్రులు చెప్తుండటంతో తమ రెక్కల కష్టం ఏమవుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు కష్టపడి సంపాదించుకున్నది కాకుండా పోతుందేమోనని భయపడుతున్నారు.

కొలతలు తీయాలా.. వద్దా?

టీఎస్‌‌ ఎన్‌‌పీబీ అప్లికేషన్‌‌లో ఆస్తుల వివరాలను నమోదు చేసేటప్పుడు సంబంధిత ఆస్తుల కొలతలు తీయాలని పంచాయతీరాజ్‌‌ శాఖ ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న కొలతలు మాత్రమే యాప్‌‌లో నమోదు చేయాలని, గతంలో చూపిన కొలతలు ఎడిట్‌‌ చేయడానికి యాప్‌‌లో ఉన్న పెన్సిల్‌‌ గుర్తును ఉపయోగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పట్టణాల్లోని ఆస్తుల నమోదు ప్రక్రియలో ఆయా ఆస్తులను మ్యాపింగ్‌‌ చేయాలి తప్ప కొలతలు అవసరం లేదని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సర్క్యులర్‌‌ ఇచ్చింది. ఆస్తుల సర్వే ఊళ్లలో ఒకరకంగా, పట్టణాల్లో మరోరకంగా సాగుతుండటంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సతాయిస్తున్న ఎన్‌‌పీబీ యాప్‌‌

టీఎస్‌‌ ఎన్‌‌పీబీ మొబైల్‌‌ యాప్‌‌లో వ్యవసాయేత ఆస్తులన్నింటి వివరాలు నమోదు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. సర్వేపై ఉద్యోగులు, సిబ్బందికి కనీసం ట్రైనింగ్‌‌ ఇవ్వలేదు. యాప్‌‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది ఒకేసారి అప్లికేషన్‌‌ను ఉపయోగిస్తుండటంతో తరచూ హ్యాంగ్‌‌ అవుతూ సతాయిస్తుస్తున్నది. మొబైల్‌‌ను ఫుల్‌‌ చార్జింగ్‌‌ చేసినా ఐదారు ఆస్తుల వివరాలు నమోదు చేసే సరికే చార్జింగ్‌‌ అయిపోతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. మొదట గ్రామానికి నాలుగైదు ఆస్తులు ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయాలని  చెప్పిన ఆఫీసర్లు.. ఇప్పుడు రోజుకు తప్పనిసరిగా 70 వరకు అప్‌‌లోడ్‌‌ చేయాలని ఆదేశించారని వారు వాపోతున్నారు.

‘ఆస్తుల నమోదు కార్యక్రమం’గా పేరు

ప్రభుత్వం చేపట్టిన సర్వేను ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రాపర్టీ అసెస్‌‌మెంట్‌‌ సర్వే అని, మరికొన్ని చోట్ల ఇండ్ల కొలతలు, ఇంటి పన్ను మదింపు సర్వే పేర్లతో చేపట్టారు. దీంతో సర్వే పేరును మార్చుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇకపై సర్వేను ‘ఆస్తుల నమోదు కార్యక్రమం’గానే పిలువాలని ఆదేశించింది. సర్వే పేరు మార్చిన ప్రభుత్వం సర్వే సందర్భంగా తలెత్తుతున్న సమస్యలు, యజమాని లైవ్‌‌ ఫొటోపై ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఆందోళనను మాత్రం పట్టించుకోవడం లేదు.

వలస పోయినోళ్లు ఇప్పుడే ఎట్లొస్తరు?

మా అన్న పేరు మీద ఇల్లు, ఖాళీ జాగ ఉన్నది. మా అన్న సూరత్‌లో సాంచాలు నడుపుతూ బతుకు తున్నడు. ఇప్పుడు ఊర్లె మొత్తం ఇండ్లు, భూములన్నీ ఆన్‌లైన్‌ చేయాలని అంటున్నరు. కరోనాతో ట్రైన్లు సరిగ్గా నడుస్త లేవ్. ఇప్పటికిప్పుడు అక్కడి నుంచి ఊరికి వచ్చుడు కూడా కష్టమే. యజమాని ఫొటో లేకుంటే ఆన్‌లైన్‌ తీసుకోదని మా ఊరి కార్యదర్శి అంటున్నడు. సర్వే పేరుతో సర్కారు సతాయించుడు కాకుంటే ఏంది ఇదీ?

–  లక్ష్మణ్​, వరంగల్‌ అర్బన్‌ జిల్లా