అమ్మాయిలు ఆఫీసుల్లో ఎలా మాట్లాడాలంటే.. ఆ మాటలే మిమ్మల్ని గెలిపించాలి.. సారీలు ఎక్కువ చెప్పొద్దు..!

అమ్మాయిలు ఆఫీసుల్లో ఎలా మాట్లాడాలంటే.. ఆ మాటలే మిమ్మల్ని గెలిపించాలి.. సారీలు ఎక్కువ చెప్పొద్దు..!

అమ్మాయిలు చిన్నప్పుడు నలుగురి మధ్యలో మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడొద్దు.... పెద్దవాళ్లు మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు మాట్లాడతావు... ఊరికే అనవసర ప్రశ్నలెందుకు వేస్తావు...  అంటూ చాలా సందర్భాల్లో అడ్డు చెప్తారు. ఇది అబ్బాయిలకంటే అమ్మాయిల విషయంలోనే ఎక్కువ. సీరియస్ విషయాల్లో అమ్మాయిల మాటలకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేస్తారు. 

ఇది క్రమంగా అలవాటైపోయి పెద్దవాళ్లయ్యాక కూడా నలుగురిలో మాట్లాడాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది. దీంతో ఆఫీసులో కూడా కొందరు అమ్మాయిలు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు. ఇది వాళ్లకెరీర్​ ను  ప్రభావితం చేస్తుంది. అందుకే మహిళలు ఆఫీసుల్లో ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పాలని, ఈ విషయంలో కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక విషయంపై తమ అభిప్రాయాన్ని  చెప్పడంలో మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు అంత స్వేచ్ఛ ఉండదు. ఇలాంటి పరిస్థితి ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇబ్బందులను  తెచ్చిపెడుతుంది. కెరీర్ లో ఎదగకుండా చేస్తుంది. అందుకే ఏ విషయంపైన అయినా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పగలగాలి. ఇది ఆఫీసులో కమ్యూనికేషన్​ కు ఉపయోగపడుతుంది. 

స్వేచ్ఛగా అభిప్రాయాల్ని చెప్పి,ప్రతిభను నిరూపించుకోవాలి.మాటల్లోనే కాన్ఫిడెన్స్ వినిపించాలి.ఎందుకంటే ఎవరైతే స్పష్టంగా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తారో వాళ్లే ఎక్కువ విజయాలు సాధిస్తారు. కెరీర్​ లో మంచి పొజిషన్ కు చేరుకుంటారు. మౌనంగా భయంగా.. తమకేమీ పట్టనట్లు ఉంటే కెరీర్ ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది.

ఈ మాటలకు బదులు

కొన్ని మాటలు మీలోని బలహీనతను తెలియజేస్తాయి. ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు ...అనుకుంటున్నాను.. బహుశా   కావొచ్చు..  వంటివి మీ అభిప్రాయంపై పూర్తి క్లారిటీ ఇవ్వవు. అంటే ఒక కచ్చితమైన ఒపీనియన్. లేదని, దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థం. అందుకే వీటికి బదులు పూర్తిగా నేను నమ్ముతున్నాను.. .అంగీకరిస్తున్నాను.. లాంటి పూర్తి అభిప్రాయాన్ని చెప్పే మాటలు మాట్లాడాలి. అలాగే ఏదైనా ఒక అంశంపై మీ అభిప్రాయాన్ని చెప్పాక చివర్​ లో  అంతేగా...నిజమే కదా....అవునా కాదా... అంటూ ఎదుటి వాళ్ల ఒపీనియన్ అడిగే ట్యాగ్ లైన్స్ వాడకూడదు.దీనివల్ల మీరు చెప్పే విషయంపై వినేవాళ్లకు తిరిగి అనుమానం ఏర్పడుతుంది. దీంతో మీ అభిప్రాయం విలువ తగ్గుతుంది.

Also Read : పెళ్లికాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు.. వారు ఎలాంటి పరిహారం చేయాలి..

ఈ ప్రశ్నలకు దూరం

ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా ఐడియా గురించి వివరించినప్పుడు అనవసరం అనిపించే డౌట్లు లేవనెత్తకూడదు. ఇది లాజికల్​ గా  వర్కవుటవుతుందా?, ఇది సరైన ఐడియానేనా? వంటి చాలా సాధారణ ప్రశ్నలు అడగకూడదు. దీనివల్ల ఒక మంచి ఐడియాపై ముందుగానే అనుమానాలు లేవనెత్తినవాళ్లవుతారు. ఒకవేళ మీకే అలాంటి ఐడియా ఇస్తే నిర్ణయాన్ని వాళ్లకే వదిలేయండి. దానిపై మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి.ఈ-మెయిల్స్... స్పీచ్.. లలో ఓన్లీ  అనే పదాన్ని కూడా తరచూ వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు.

యెస్.. చెప్పాలంటే

ఒక కొత్తటాస్క్ లేదా ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు వెంటనే యెస్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ముందుగా మీ శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోండి. మీరు చేయగలను అనుకుంటేనే యెస్ చెప్పండి. మీ స్థాయికి మించిన పనులొచ్చినప్పుడు సున్నితంగా ... నో... చెప్పండి. అలాగే ఆఫీస్ వర్క్​ లోఇతరులకు హెల్ప్ చేయాల్సొచ్చినప్పుడు కూడా వీలైతేనే యెస్ చెప్పండి. మొహమాటానికి ప్రతిసారీ ఇలా యెస్ చెప్పుకుంటూ వెళ్తే మీరు చేసే ఏ పనికీ చివరకు విలువ లేకుండా పోతుంది. 

సారీ.. వద్దు 

ఆఫీసులో ఒక పని లేటుగా చేసినా, తప్పుగా చేసినా సారీ చెప్పడం మామూలే. కానీ, ప్రతి చిన్న విషయానికి కొలీగ్ కు లేదా బాస్​ కు  ఇలా ..సారీ... చెప్పే నేచర్ మంచిది కాదు. ఇది మహిళల బలహీన మనస్తత్వాన్ని సూచిస్తుంది. నిజంగా ...సారీ... చెప్పాల్సిన సందర్భంలోనే చెప్పండి. లేదంటే సరైన వివరణ ఇవ్వండి. ఒకవేళ మీకు ప్రతిసారీ ఇలా ...సారీ... చెప్తున్నామనిపిస్తే రోజూ ఎన్నిసార్లు ...సారీ... చెప్తున్నారో లెక్కబెట్టుకోండి. ఎక్కువ ...సారీ..లు ఉంటే వీలైనంత తగ్గించుకుని పనిపై దృష్టిపెట్టండి.

–వెలుగు,లైఫ్​–