మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ముదిరాజు కుటుంబాలు కులవృత్తిని ఆధారంగా చెరువుల్లో చేపలను పట్టుకొని తమ కుటుంబాలను పోషించుకుంటారని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సదుద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతుందన్నారు వాకిటి.
గత ప్రభుత్వాలు మత్స్యకారులను సరిగ్గా పట్టించుకోలేదని చెరువుల్లో ఎన్ని చేపలను వదిలారో కూడా లెక్కలు లేవన్నారు మంత్రి వాకిటి. జిల్లాలో ఒక కోటి 29 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని.. దీనికి కోటి 7 లక్షల రూపాయలను వెచ్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 5 లక్షల మత్స్య కారుల కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా రూ. 123 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు వాకిటి.
మత్స్యకారుల సంఘాల్లో సభ్యత్వ సమస్య ప్రధానంగా ఉందని..ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు వాకిటీ.
