
ఏపీలో కూటమి నాయకుల మధ్య వివాదాలు సంచలనం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ. 5 కోట్లు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబందించిన ఆధారాలు కూడా బయటపెట్టారు కొలికపూడి. రూ. 5 కోట్లు తీసుకొని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారని అన్నారు కొలికపూడి. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ ఫర్ చేశారన్నది వెల్లడించారు కొలికపూడి శ్రీనివాస్.
2024 ఫిబ్రవరి 7న రూ. 20 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశానని.. ఫిబ్రవరి 8న మరో రూ. 20 లక్షలు, ఫిబ్రవరి 14న మరో రూ. 20 లక్షలు బదిలీ చేశానని అన్నారు. చిన్ని పీఏ మోహన్ కు రూ. 50 లక్షలు, గొల్లపూడిలోని తన ఫ్రెండ్స్ ద్వారా మిగతా రూ. మూడున్నర కోట్లు ఇచ్చానని అన్నారు కొలికపూడి శ్రీనివాస్. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ శుక్రవారం ( అక్టోబర్ 24 ) వెల్లడిస్తానని అన్నారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ కొలికపూడి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా... కొలికపూడి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని. తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడని.. తనపై విమర్శలు చేసినవాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలని అన్నారు. తాను డబ్బులు సంపాదించుకోవాలంటే.. తిరువూరు వరకు రావాల్సిన అవసరం లేదని.. కొల్లికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని అన్నారు.