మాసబ్ ట్యాంక్ రూట్లో వెళ్లే వాహనదారులకు అలర్ట్: ఆరు వారాల పాటు నైట్ ఫ్లైఓవర్ బంద్

మాసబ్ ట్యాంక్ రూట్లో వెళ్లే వాహనదారులకు అలర్ట్: ఆరు వారాల పాటు నైట్ ఫ్లైఓవర్ బంద్

హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ రూట్లో వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆరు వారాల పాటు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్‎ బంద్ కానుంది. ఇది కేవలం రాత్రి సమయంలో మాత్రమే. మరమ్మతు పనుల కారణంగా ఆరు వారాల పాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మ్యాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మూసివేయబడుతుందని అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో వంతెన మరమ్మతు పనులు చేపడతామని.. ఇందుకోసమే ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తున్నామని చెప్పారు జీహెచ్ఎంసీ అధికారులు. 

కాగా, మెహదీపట్నం వైపు ట్రాఫిక్ ప్రవాహాన్ని క్రమబద్దీకరించడానికి 2001లో మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్‎ను ప్రారంభించారు. ఈ వంతెన నిర్మించి 25 ఏండ్లు కావస్తుండటంతో పాటు భారీ వర్షాల సమయంలో నీటి లీకేజీని నివారించడానికి అరిగిపోయిన స్ట్రిప్ సీల్ జాయింట్‌లకు మరమ్మతులు చేపడతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగానే విడతల వారీగా ఫ్లైఓవర్‎ను మూసివేసి నిర్వహణ పనులు చేపడుతున్నారు. 

Also Read : నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం

ఫ్లైఓవర్ మూసివేతపై ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్. కోటేశ్వర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఆరు వారాల పాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపారు. వంతెన నిర్వహణ పనుల నేపథ్యంలో మూసివేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో  మహావీర్ హాస్పిటల్ నుంచి ఎన్ఎండీసీ వైపు ప్రయాణించే వాహనదారులు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్‌కు బదులుగా సర్వీస్ రోడ్డును ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు.