
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమెజాన్ ఇండియాపై ఏపీ, కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు.. ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ పంపినందుకు అమెజాన్‌తో పాటు ఇద్దరు సెల్లర్లకు నాన్-బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) ఇష్యూ చేసింది.
ఫోరం ఆదేశాలను ధిక్కరించినందుకు వారెంట్లు ఇష్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూల్ జిల్లా బెలగల్ మండలం కూరువా స్ట్రీట్‌లో ఉండే కె. వీరేశ్.. గతేడాది సెప్టెంబర్ 2న అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ ఇచ్చి రూ. 79,900 చెల్లించాడు. కానీ, అతనికి ఐఫోన్‌కు బదులు ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ వచ్చింది. దాంతో వీరేశ్ అమెజాన్‌ను సంప్రదించి, రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ ఇవ్వాలని కోరాడు. సెల్లర్ దీన్ని పట్టించుకోలేదు.
దీంతో వీరేశ్ కర్నూలులోని కన్స్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. అమెజాన్, సెల్లర్ కలిసి ఐఫోన్ 15 ప్లస్‌ను ఇవ్వాలని లేదా రూ.79,900కి 12 శాతం వడ్డీతో రీఫండ్ చేయాలని ఈ ఏడాది జూన్ 16న ఫోరం ఆదేశాలిచ్చింది. కస్టమర్‌ను మానసికంగా హింసించినందుకు రూ. 25 వేలు, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఫోరం స్పష్టం చేసింది. అయినా..అమెజాన్, సెల్లర్స్ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో వీరేశ్ ఆగస్టు 18న ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్చేశాడు. దీంతో కమిషన్ మరో నోటీస్ ఇచ్చింది.