ఛాయ్​ పోయొద్దు.. బట్టలు ఉతకొద్దు.. చనిపోతే డప్పు కూడా కొట్టొద్దు

ఛాయ్​ పోయొద్దు.. బట్టలు ఉతకొద్దు.. చనిపోతే డప్పు కూడా కొట్టొద్దు
  •     సిద్దిపేట జిల్లా ఖాజీపూర్​లో ముదిరాజ్​ కులస్తులకు సహాయ నిరాకరణ
  •     ఉల్లంఘిస్తే రూ.5 వేల ఫైన్​ 
  •     కలెక్టర్​కు మొర పెట్టుకున్న బాధితులు

దుబ్బాక, వెలుగు : ముదిరాజ్ ​కులస్తులకు, గ్రామస్తులకు ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఏకంగా వారికి గ్రామంలో సహాయ నిరాకరణ చేయాలని ప్రకటించే వరకు వెళ్లింది. ముదిరాజ్​కులస్తులకు హోటళ్లలో టీ, కిరాణం షాపుల్లో నిత్యావసర వస్తువులు ఇవ్వొద్దని, గౌడ్స్​కల్లు పోయొద్దని, నాయీ బ్రహ్మణులు కటింగ్, గడ్డం చేయొద్దని, రజకులు బట్టలు ఉతకొద్దని, ఎవరైన మరణిస్తే చావు డప్పు కొట్టొద్దని, కిరాయి ఇండ్లల్లో ఉంటున్న వ్యక్తులను ఖాళీ చేయించాలని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్భర్​పేట భూంపల్లి మండలం ఖాజీపూర్​లో జరిగింది. గ్రామానికి చెందిన 20 ముదిరాజ్ కుటుంబాలు 1994లో మత్స్య పారిశ్రామిక సొసైటీగా ఏర్పాటు చేసుకుని జిల్లా మత్స్య సహకార సంఘంలో రిజిస్ట్రేషన్​చేసుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలోని చెరువులు, కుంటల్లో చేపలు పెంచి, అమ్ముకుంటూ బతుకుతున్నారు. 5 నెలల క్రితం గ్రామ మత్స్య సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా మత్స్య సహకార సంఘానికి వినతి పత్రం ఇచ్చారు. సంబంధిత అధికారి ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తామని నోటీసులు అందజేశారు.  

ఆ రోజున గ్రామానికి వస్తామని చెప్పిన అధికారి ఎంతకీ రాకపోవడంతో సొసైటీ సభ్యులు ఫోన్​చేయగా ‘మీ గ్రామంలో కొంతమంది ఫోన్​చేసి ఎన్నికలు నిర్వహించొద్దని బెదిరించారు. అందుకే రాలేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న  గ్రామానికి చెందిన కొంతమంది పొలిటికల్​లీడర్లు అదే రోజు రాత్రి ముదిరాజ్​కులస్తులకు ఎవ్వరూ సాయం చేయొద్దని ఆర్డరిచ్చారు. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించిన వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని, సదరు వ్యక్తులకు ఎవరైనా సహకరించినట్లు సమాచారం ఇస్తే రూ. 2 వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని శుక్రవారం కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాడని బాధితులు తెలిపారు.