జపాన్​లో నూడిల్స్​ ధరలు పెరగడానికి కారణమేంటీ?

జపాన్​లో నూడిల్స్​ ధరలు పెరగడానికి కారణమేంటీ?

జపాన్​లో నూడిల్స్​ చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ సోబా నూడిల్స్... ఇవి​ వాళ్ల ట్రెడిషనల్​ ఫుడ్ ఐటమ్​. అంటే ఆకలేసినప్పుడు మనం అన్నం తిన్నట్టే వాళ్లకి ఈ నూడిల్స్​ అన్నమాట. అంతగా ఇష్టపడే ఈ నూడిల్స్​ ధర ఇప్పుడు పెరిగింది. అయితేనేం ఏ వస్తువైనా, ఫుడ్ ఐటమ్​ అయినా అప్పుడప్పుడూ ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. అందులో ఆశ్చర్యం ఏముంది? అంటున్నారా! అదే మరి ట్విస్ట్​. గత పదేండ్లలో ఒక్కసారి కూడా సోబా నూడిల్స్​ ధర పెరగలేదు. మరి సడెన్​గా ఇప్పుడెందుకు పెరిగినట్టు?

సోబా నూడిల్స్​ జపాన్​ వాళ్లకు ట్రెడిషనల్​ ఫుడ్. వాటిని తయారుచేసుకునేది వాళ్లే. కానీ, సోబా నూడిల్స్​ తయారుచేయడానికి కావాల్సిన ముడి సరుకు కుట్టు (బక్​వీట్) రష్యాలో ఎక్కువగా పండుతుంది. అక్కడి నుంచి జపాన్​కు ఎగుమతి అవుతుంది. అయితే ఈ మధ్య రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం వల్ల ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే వస్తువులు, పదార్థాల ధరలు పెరిగాయి. దాంతో చాలా దేశాలు తక్కువ మొత్తంలో దిగుమతులు చేసుకుంటున్నాయి. అలాగే రష్యా నుంచి జపాన్​ దిగుమతి చేసుకునే బక్​వీట్ క్వాంటిటీ కూడా తక్కువ కావడంతో వాటితో తయారు చేసే సోబా నూడిల్స్​ ధరలు కూడా పెరిగాయి. 

ఇప్పటిది కాదు...

సోబా నూడిల్స్​ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో క్యాలరీలు తక్కువ. పోషకాలు ఎక్కువ. ప్రొటీన్స్​​, యాంటీ ఆక్సిడెంట్స్, క్లోరిన్, థయమిన్, రిబోఫ్లేవిన్​లు పుష్కలం. శీతాకాలం, ఎండాకాలాల్లో తక్కువ ధరకు దొరికే హెల్దీ ఫుడ్​గా ఇది ఫేమస్. దీన్ని వేడివేడిగా, చల్లచల్లగా ఎలాగైనా తినొచ్చు. ఇది ఇప్పటిది కాదు.. ‘టొకుగవ’ (1603 –1867) కాలం నాటిది. అప్పట్లోనే సోబాను తినడం మొదలుపెట్టారు జపనీయులు. జపాన్​లోని రెండో అతిపెద్ద ఐలాండ్ ‘హొక్కాయిడొ’లో కూడా బక్​వీట్​ను పండిస్తారు. ఫ్రెష్​ బక్​వీట్​ని షిన్ – సోబా అంటారు. వాటితో సోబా నూడిల్స్ తయారుచేస్తారు.