నార్త్​–సౌత్​కొరియాల బలప్రదర్శన

నార్త్​–సౌత్​కొరియాల బలప్రదర్శన
  • బార్డర్​లో యుద్ధ విమానాల మోహరింపు

సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య టెన్షన్ మరింత పెరిగింది. ఇరు దేశాల మధ్య ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉత్తర కొరియా శుక్రవారం తన భూభాగంలో దాదాపు 180 యుద్ధ విమానాలను మోహరించింది. దీంతో దక్షిణ కొరియా కూడా 80 ఫైటర్ జెట్లను తన దేశ సరిహద్దుల వద్ద మోహరించింది. వాటిలో ఎఫ్​ 35 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. సౌత్ కొరియా, అమెరికా కలిసి నిర్వహిస్తున్న మిలటరీ డ్రిల్స్ కు కౌంటర్​గా నార్త్ కొరియా బుధవారం తన దేశ పరిధిలో 30 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించగా వాటిలో ఓ క్షిపణి సౌత్ కొరియా సముద్ర జలాల్లో పడింది. దీంతో అక్కడ ఉల్లెంగ్డో దీవిలోని జనాలను ప్రభుత్వం బంకర్లలోకి పంపించింది. జపాన్ కు వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది.

తాజాగా  నార్త్ కొరియా తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో 180 ఫైటర్ జెట్లను మోహరించిందని, వాటిలో కొన్ని విమానాలు గగనతలంలో చక్కర్లు కొట్టాయని సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్​ స్టాఫ్​ ఆఫీస్​ వెల్లడించింది. అయితే ఆ విమానాలు తమ దేశ సరిహద్దుల సమీపంలోకి రాలేదని పేర్కొంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ విమానాలు తిరిగాయని తెలిపింది. ఆ విమానాలు ఏవీ కూడా తమ దేశ ‘టాక్టికల్ యాక్షన్ లైన్’ (సరిహద్దుల నుంచి 20 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతం) ను దాటలేదని వెల్లడించింది. కాగా ‘విజిలెంట్ స్టార్మ్’ పేరిట నిర్వహిస్తున్న మిలిటరీ డ్రిల్స్ ను అమెరికా, సౌత్ కొరియా శనివారం వరకు పొడిగించాయి. ఆ విన్యాసాలు శుక్రవారమే ముగియాల్సి ఉంది. కానీ నార్త్ కొరియా బుధవారం క్షిపణులను ప్రయోగించి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో మిలిటరీ డ్రిల్స్ ను పొడిగించినట్లు తెలుస్తోంది.