రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు

రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా నిష్క్రమిస్తాయని, రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎంటరవుతాయని హైదరాబాద్​వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని తెలిపింది. కాగా, రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్​ రెండ్రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే చాన్స్​ ఉందని వెల్లడించింది. మరోవైపు మంగళవారం నల్గొండ, కామారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా సోమూరులో 4.4 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా పడమటిపల్లెలో 2.9, ముదిగొండలో 2.6, కోదండపురంలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.