ఓస్లో: ఇండియా గ్రాండ్ మాస్టర్లు డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీని విజయాలతో ప్రారంభించారు. విన్సెంట్ కీమర్ (జర్మనీ), గుకేశ్ మధ్య మంగళవారం జరిగిన క్లాసికల్ తొలి రౌండ్ గేమ్ 144 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య ఆర్మగెడాన్ టైబ్రేక్‌ను నిర్వహించారు.
ఇందులో గుకేశ్ 22 ఎత్తుల్లోనే కీమర్‌కు చెక్ పెట్టాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ వెస్లీ సోతో జరిగిన క్లాసికల్ గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. తర్వాత నిర్వహించిన ఆర్మగెడాన్ టైబ్రేక్‌లో ప్రజ్ఞా దూకుడుగా ఆడి విజయాన్ని అందుకున్నాడు. ఈ రౌండ్ తర్వాత ఇద్దరి ఖాతాలో చెరో ఒకటిన్నర పాయింట్లు ఉన్నాయి.
వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన అలీరెజా ఫిరౌజా మూడు పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్ తొలి రౌండ్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి బిబిసార అసౌబయేవా (కజకిస్తాన్) చెక్ పెట్టగా, దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేక్‌లో వరల్డ్ చాంపియన్ జూ వెన్‌జున్ (చైనా)ను ఓడించింది. దివ్య 1.5 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది.
