రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

చైనాను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్… ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి.  అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. హైదరాబాద్ లోని  గాంధీ ఆస్పత్రిలో, ఫీవర్ ఆస్పత్రుల్లో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎరికి కూడా కరోనా వైరస్ లేదని తేలింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలిగితే వెంటనే గాంధీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కరోనాపై వస్తున్న వదంతులు నమ్మొద్దన్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చాక కూడా 14 రోజులు హోమ్ ఐసోలేష్ లో ఉండాలని సూచించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకైనా వైద్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. కరోనా రోగుల కోసం  నగరంలోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ రోగుల కోసం రెండో వార్డును అధికారులు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. 10 మంది రోగులకు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పారు.  ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా అనుమానిత కేసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మాస్క్‌లతో పాటు డిస్పోజబుల్‌ డ్రస్సులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్‌… గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, దీంతో వైద్య సిబ్బందిని తప్ప ఇతరులెవరిని ఆ వార్డులోకి అనుమతించడం లేదని అస్పత్రి అధికారులు చెబుతున్నారు.