
కామెడీని పక్కనపెట్టి కంటెంట్‌కు ప్రయారిటీ ఇస్తున్న అల్లరి నరేష్.. ఇప్పుడు ‘ఉగ్రం’ అనే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్టర్ చేసిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈనెల 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నరేష్ చెప్పిన విశేషాలు.. ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్. మిస్సింగ్ పీపుల్ గురించిన కథ. మనకి సమస్య వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తాం, అదే పోలీస్ కి సమస్య వస్తే ఏం చేస్తాడు? ఎలా ట్రీట్ చేస్తాడనేది కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా వుంటుంది. నా పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఐదేళ్లలో జరిగే కథ. ఎస్సై ట్రైనింగ్‌లో ఒక అమ్మాయిని ప్రేమించడం, తర్వాత పెళ్లి, ఒక కూతురు ఉంటుంది. మొదట ఎస్‌ఐ, తర్వాత సిఐ, చివర్లో షార్ట్ హెయిర్ వున్న పాత్ర చేశా. యాక్షన్ రోల్ కనుక ఓ చిన్న భయం వుండేది. కానీ ట్రైలర్ చూశాక ప్రేక్షకులు పాత్రకే కనెక్ట్ అయ్యారు. గతంలో కూడా యాక్షన్ సీన్స్ చేశాను. కానీ అవి కామెడీ గా వుంటాయి. నాకు రోప్ , ఫైట్లు కొత్త కాదు. అయితే ఇందులో ఎమోషన్ కొత్త. ఫైట్ల కోసం రిహార్సల్ చేయడం కలిసొచ్చింది. మెంటల్‌గా ఫిజికల్‌గా బాగా కష్టపడి చేసిన చిత్రమిది. నా పాత్ర విషయంలో దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా చెప్పేశాడు. పోలీస్ పాత్రకు నా ఎత్తు, పొడుగు ఓకే. కానీ బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నటించా. దర్శకుడు మనల్ని నమ్మితే దాని రిజల్ట్ వేరేలా వుంటుంది. ఇంత ఇంటెన్స్ రోల్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా విజయ్‌కి వెళుతుంది. కామెడీ సినిమాల తర్వాత ఇలాంటివి చేయడం సేఫ్ జోన్ కాదు. నేను చేసిన కామెడీ సినిమాలు చూసి.. నరేష్ సినిమా బావుంది అంటారు కానీ నరేష్ కామెడీ బాగా చేశాడని అనలేదు. కానీ గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు చూసినపుడు నరేష్ బాగా నటించాడని చెప్పారు. విజయ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తా.దానికోసం ఇప్పటికే ఓ లుక్ అనుకున్నాం. వచ్చే ఏడాది ఉండొచ్చు. అలాగే త్వరలోనే ఓ కామెడీ సినిమా చేస్తున్నా.
కామెడీని వదలను..
ఆడా ఉంటా, ఈడా ఉంటా (నవ్వుతూ). ఇక ప్రస్తుతం నేను ఫరియా అబ్దుల్లా కలసి ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బు దర్శకత్వంలో మరో సినిమా ఉంది. అలాగే ‘జెండా’ అనే కథ రెడీగా ఉంది. అది నేనే నిర్మాతగా చేస్తాను. ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. కామెడీ చేసేవాళ్ళు అంటే ఎక్కడో చిన్న చూపు. ఈ విషయంలో నాకు ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ వుంది. నిజానికి కామెడీ చేయడమే చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందం గారు, ‘విడుదల’లో సూరిలను అందరూ వెల్ కమ్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.